37.jpg)
సిఎం కేసీఆర్ రేపు (శుక్రవారం) మళ్ళీ ఢిల్లీ వెళుతున్నారు. సిఎం కేసీఆర్ సెప్టెంబర్ మొదటివారంలో ఢిల్లీలో వారం రోజులుండి ప్రధాని నరేంద్రమోడీతో సహా పలువురు కేంద్రమంత్రులను కలిసి వచ్చారు. రెండు వారాల వ్యవధిలోనే సిఎం కేసీఆర్ మళ్ళీ రేపు హడావుడిగా ఢిల్లీ బయలుదేరుతుండటం విశేషమే. అదీ...రేపటి నుంచి శాసనసభ సమావేశాలు మొదలవుతున్నవేళ ఢిల్లీకి వెళుతుండటం గమనిస్తే ఇది రాజకీయ పర్యటన కావచ్చనిపిస్తోంది. కానీ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశమయ్యేందుకు వెళుతున్నట్లు ప్రకటన వెలువడింది. కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఆదివారం విజ్ఞాన్ భవన్‌లో జరిగే సమావేశంలో సిఎం కేసీఆర్ పాల్గొన్నాక సాయంత్రం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు. రేపు శాసనసభ బీఏసీ సమావేశం ముగియగానే సిఎం కేసీఆర్ ఢిల్లీ బయలుదేరి వెళతారు.