
హుజూరాబాద్ ఉపఎన్నికపై టిఆర్ఎస్ అత్యుత్సాహం ప్రదర్శించి చేజేతులా పెద్ద సమస్యను తెచ్చి పెట్టుకొందని చెప్పవచ్చు. దీనిని టిఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ‘పని’ మొదలుపెట్టడంతో ఈటల రాజేందర్, బిజెపి నేతలు కూడా టిఆర్ఎస్‌ను ఓడించేందుకు పట్టుదలగా కృషి చేస్తున్నారు. ఆర్ధికమంత్రి హరీష్ రావు తన శాఖ వ్యవహారాలను, బాధ్యతలను అధికారులకు అప్పగించి గత నాలుగు వారాలుగా ఉపఎన్నిక కోసం హుజూరాబాద్‌లో మకాం వేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. చెన్నూరు టిఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌పై విమర్శలు గుప్పించడంతో ఆ పార్టీ నేతలు కూడా ఘాటుగా బదులిస్తున్నారు.
మంచిర్యాల జిల్లా బిజెపి అధ్యక్షుడు రఘునాధరావు బుదవారం జమ్మికుంటలో మీడియాతో మాట్లాడుతూ, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ తన సొంత నియోజకవర్గంలో సమస్యలు, అభివృద్ధిని పట్టించుకోకుండా హుజూరాబాద్‌లో విహారయాత్ర చేస్తున్నారు. 2018 శాసనసభ ఎన్నికలలో సిఎం కేసీఆర్‌ను చెన్నూరును తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అన్నివిదాల అభివృద్ధి చేస్తామని హామీలు ఇచ్చారు. కానీ ఇంతవరకు ఒక్క హామీని పూర్తి చేయలేదు. చెన్నూరుకు ఇచ్చిన హామీలను అమలుచేయకుండా ఇప్పుడు హుజూరాబాద్ ప్రజలను మభ్య పెట్టేందుకు కొబ్బరికాయలు కొట్టి శంఖుస్థాపనలు చేస్తూ విహారయాత్ర చేస్తున్నారు. అసలు చెన్నూరు ఎమ్మెల్యేకి హుజూరాబాద్‌లో ఏమి పని?” అంటూ తీవ్ర విమర్శలు చేశారు.