
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. టీటీడీలో 52 మంది ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో (568,569)లపై స్టే విధించింది. టీటీడీలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. టీటీడీ బోర్డులో ఇంతమందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించడం టీటీడీ స్వతంత్రను దెబ్బ తీస్తుందని, ప్రత్యేక ఆహ్వానితుల రాకపోకలతో, వారి సిఫార్సు లేఖలతో సామాన్య భక్తులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని పిటిషనర్లు పేర్కొన్నారు. టీటీడీలో ఇంతమందిని నియమించడం నిబందనలకు విరుద్దమని కనుక ప్రభుత్వం జారీ చేసిన ఆ రెండు జీవోలను రద్దు చేయాలని పిటిషనర్లు వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న తరువాత హైకోర్టు ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఆ రెండు జీవోను తాత్కాలికంగా నిలిపివేస్తూ (స్టే) ఉత్తర్వులు జారీ చేసింది.
అధికారంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా కోట్లాదిమంది ఆరాధ్యదైవమైన తిరుమల పవిత్రతకు, ఆధ్యాత్మికతకు భంగం కలిగించకుండా వ్యవహరించాలి. కానీ తిరుమలను కూడా రాజకీయవేదికగా మార్చేస్తున్నాయి అధికార పార్టీలు. టీటీడీ బోర్డులో చాలామంది రాజకీయ నాయకులు ఉండటమే ఇందుకు నిదర్శనం. వారు సరిపోరనట్లు ప్రభుత్వ పెద్దలకు ఆత్మీయులు, స్నేహితులు, బంధువులను కూడా ప్రత్యేక ఆహ్వానితుల పేరిట టీటీడీ బోర్డులోకి జొప్పించడం చాలా శోచనీయం. టీటీడీ పవిత్రతను, భక్తుల మనోభావాలు పట్టించుకోకుండా వ్యవహరిస్తే చివరికి కోర్టుల చేత ఈవిదంగా మొట్టికాయలు వేయించుకోక తప్పదు.