ఢిల్లీలో అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై దాడి

ఢిల్లీలోని అశోకా రోడ్డులోని మజ్లీస్ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై హిందూసేనకు చెందిన కొందరు కార్యకర్తలు కర్రలు, రాళ్ళతో మంగళవారం దాడి చేశారు. వారి దాడిలో ఇల్లు స్వల్పంగా దెబ్బతింది. సమాచారం అందుకొన్న ఢిల్లీ పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని వారిలో ఐదుగురుని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దాడి జరిపినవారిపై కేసు నమోదు చేశామని డీసీపీ దీపక్ యాదవ్ తెలిపారు. ఈ దాడి వెనుక ఎవరైనా ఉన్నట్లు తెలిస్తే వారిపై కూడా కేసు నమోదు చేస్తామని తెలిపారు. 

ఈ ఘటనపై అసదుద్దీన్ ఓవైసీ ట్విట్టర్‌లో స్పందిస్తూ, దేశరాజధాని ఢిల్లీలో ఓ పార్లమెంటు సభ్యుడి ఇంటికే రక్షణ లేకపోతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి? ఈ దాడిపై ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షాలు ఏమి సమాధానం చెపుతారు? ఇటువంటి దాడులతో మమ్మల్ని ఎవరూ భయపెట్టలేరని గ్రహిస్తే మంచిది,” అని అన్నారు.