నేడు ఇందిరాపార్కు వద్ద ప్రతిపక్షాల మహాధర్నా

కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు (బిజెపి మినహా) నేడు ఇందిరా పార్కు వద్ద మహా ధర్నా నిర్వహించబోతున్నాయి. దీనిలో కాంగ్రెస్‌, వామ పక్షాలు, తెలంగాణ జనసమితి, తెలంగాణ ఇంటి పార్టీ, ప్రజా సంఘాలు, కొన్ని కుల సంఘాలు పాల్గొనబోతున్నాయి. 

ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు జరిగే ఈ మహాధర్నాలో కాంగ్రెస్ తరపున పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, మధుయాష్కీ గౌడ్, మల్లు రవి, అద్దంకి దయాకర్, టిజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ, సిపిఐ (ఎంఎల్),తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ తదితరులు పాల్గొనబోతున్నారు. మంగళవారం అన్ని పార్టీల ప్రతినిధులు గాంధీభవన్‌లో సమావేశమయ్యి నేడు చేయబోయే మహాధర్నా గురించి చర్చించారు.         

ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేత మల్లు రవి మాట్లాడుతూ రాష్ట్రంలో టిఆర్ఎస్‌ నిరంకుశ పాలనను అంతమోదించేందుకు రాజకీయ పునరేకీకరణ మొదలైందని అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ, సిఎం కేసీఆర్‌ల నుంచి దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఉద్యమస్తాయిలో పోరాటం చేయక తప్పదని, ఈ మహాధర్నాతో పోరాటం మొదలవుతుందని అన్నారు.