
వైఎస్సార్టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అక్టోబర్ 20వ తేదీన చేవెళ్ళ నుంచి ‘ప్రజా ప్రస్థానం’ పేరిట రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయబోతున్నట్లు సోమవారం ప్రకటించారు. తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయబోతున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ, “టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తోంది. టిఆర్ఎస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో రైతులందరికీ రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. కానీ కేవలం మూడు లక్షల మందికి మాత్రమే మాఫీ చేసి మిగిలినవారికి ఇవ్వకపోవడంతో రాష్ట్రంలో సుమారు ఏడు వేలమంది రైతులు అప్పుల బాధలు భరించలేక ఆత్మహత్యలు చేసుకొన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్లు వెలువడకపోవడంతో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. అయినప్పటికీ సిఎం కేసీఆర్ చలించడం లేదు. అందుకే టిఆర్ఎస్ ప్రభుత్వం చేత హామీల అమలుచేయించేందుకు ఈ మహా ప్రస్థానం పాదయాత్ర చేయాలని నిశ్చయించుకొన్నాను,” అని అన్నారు.
ఇప్పటికే రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రంలో వరుసగా దండోరా సభలు నిర్వహిస్తోంది. వచ్చే శాసనసభ ఎన్నికలలో టిఆర్ఎస్ను ఓడించి రాష్ట్రంలో అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని రెండు పార్టీల నేతలు బహిరంగంగానే చెపుతున్నారు. వైఎస్ షర్మిల లక్ష్యం కూడా అదే. కనుక ఈ పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో తమ పార్టీని బలోపేతం చేసుకొనేందుకు యత్నిస్తున్నట్లు భావించవచ్చు. తెలంగాణ ప్రజలు ఒకవేళ టిఆర్ఎస్ను వద్దనుకొంటే కాంగ్రెస్ లేదా బిజెపిలకు ఓట్లు వేస్తారని అందరికీ తెలుసు. కానీ వైఎస్ షర్మిల కూడా రాష్ట్రంలో అధికారంలోకి రాగలనని ఆశ పడుతుండటమే చాలా విచిత్రంగా ఉంది.