టీ-కాంగ్రెస్ అందుకు తెరాస సర్కార్ కి థాంక్స్ చెప్పుకోక తప్పదు

రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై మిగిలిన పార్టీల కంటే కాంగ్రెస్ పార్టీయే అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రభుత్వంతో గట్టిగా పోరాడింది. తెరాస సర్కార్ తన వైఫల్యాల నుంచి, రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న అనేక సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్ళించడానికే జిల్లాల పునర్విభజనకి పూనుకొందని మాజీ కాంగ్రెస్ ఎంపి పొన్నం ప్రభాకర్ నిన్ననే విమర్శించారు. కానీ దాని వలన కాంగ్రెస్ పార్టీలో రాజకీయ నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు లభించాయనే సంగతి ఇప్పుడు ఆ పార్టీకి కూడా అర్ధం అయినట్లే ఉంది.

 రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో కొత్తగా 17జిల్లాలు ఏర్పడుతున్నందున, అన్ని జిల్లాలకి డిసిసి అధ్యక్షులని, కార్యవర్గ సభ్యులని త్వరలోనే నియామకాలు పూర్తి చేస్తాను. కార్యవర్గ సభ్యుల నియామకాల కోసం టీపీసీసీ ఉపాధ్యక్షుడు నాగయ్య అధ్యక్షతన ఐదుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన కమిటీ చేసిన ప్రతిపాదనలని బట్టి చూసినట్లయితే కనీసం 40 మందికి కొత్తగా పదవులు దక్కే అవకాశం ఉంది. అలాగే టీపీసీసీకి కూడా కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులని 4 రోజులలోనే నియమిస్తాను,” అని అన్నారు.

అంటే తెరాస సర్కార్ నిర్ణయం వలన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రయోజనం కలిగిందని స్పష్టం అవుతోంది. తెలంగాణా ఇచ్చినందుకు 2014 ఎన్నికలలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకే అధికారం దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ, రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అందరూ పదవుల కోసం, తమకి, తమ బందుమిత్రులకి టికెట్ల కోసం, అప్పుడు పిసిసి అధ్యక్షుడుగా ఉన్న పొన్నాలని తప్పించి ఆ కుర్చీలో కూర్చోవడం కోసమే ఆ పార్టీ నేతలు అందరూ ప్రయత్నించారు తప్ప తమ పార్టీయే తెలంగాణా ఇచ్చిందనే విషయాన్నీ గట్టిగా ప్రచారం చేసుకోకుండా నిర్లక్ష్యం వహించారు.

బహుశః గెలుపుపై ధీమాతోనే వారు ఆవిధంగా కీచులాడుకొంటూ కాలక్షేపం చేశారని చెప్పవచ్చు. వారి ఆ ధీమా, టికెట్లు, పదవుల కోసం ఆ దురాశ కారణంగానే సునాయాసంగా గెలవలసిన కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కానీ నేటికీ పదవుల కోసం వారి ఆరాటం ఏమాత్రం తగ్గలేదు. వారి ఆరాటాన్ని తెరాస సర్కార్ ఈవిధంగా తీర్చు తోంది కనుక దానికి వారు కృతజ్ఞతలు చెప్పుకోక తప్పదు.