హుస్సేన్‌సాగర్‌లో గణేశ్ నిమజ్జనంపై సర్వత్రా ఉత్కంఠ

హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ)తో తయారుచేసిన గణేశ్ విగ్రహాలను నిమజ్జనం చేయడానికి హైకోర్టు అనుమతించకపోవడంతో జీహెచ్‌ఎంసీ కమీషనర్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. నగరంలో వేలాది గణేశ్ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయాల్సి ఉంది కనుక తక్షణమే దీనిపై విచారణ జరిపి సానుకూలంగా నిర్ణయం వెలువరించాలని పిటిషన్‌లో కోరారు. దీనిపై ఈరోజు మధ్యాహ్నం భోజన విరామ సమయం తరువాత లేదా గురువారం ఉదయం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. 

భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ్ కమిటీ మాత్రం కోర్టు తీర్పులతో సంబందం లేకుండా ఖైరతాబాద్ గణేశ్ విగ్రహాన్ని హుస్సేన్‌సాగర్‌లోనే నిమజ్జనం చేస్తామని నిన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు తెలియజేసింది. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ కూడా ఖైరతాబాద్ గణేశ్ విగ్రహాన్ని హుస్సేన్‌సాగర్‌లోనే నిమజ్జనం చేస్తామని చెపుతున్నారు. ఒకవేళ సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పునే సమర్ధిస్తూ హుస్సేన్‌సాగర్‌లో పీఓపీతో చేసిన గణేశ్ విగ్రహాలను నిమజ్జనం చేయడానికి వీలులేదని చెప్పినట్లయితే తెలంగాణ ప్రభుత్వం చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసిరావచ్చు.