సెప్టెంబర్ నెలాఖరులోగా దళిత బంధు నిధులు విడుదల

దళిత బంధు పధకం అమలుపై సిఎం కేసీఆర్‌ అధ్యక్షతన నిన్న ప్రగతి భవన్‌లో సన్నాహక సమావేశం జరిగింది. దీనిలో టిఆర్ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్‌ బండా శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌లతో పాటు కాంగ్రెస్‌ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మోత్కుపల్లి నర్సింహులు, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

సిఎం కేసీఆర్‌ వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “హుజూరాబాద్‌, వాసాలమర్రితో సహా రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు పధకానికి మంచి స్పందన వస్తోంది. ఈ పధకంతో దళితుల ఆర్ధిక స్థితి మెరుగుపడి వారి జీవన ప్రమాణాలు కూడా మెరుగవుతాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. రాష్ట్రంలో బ్రాహ్మణులతో సహా అన్ని కులాలు, మతాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు పధకాలు అమలుచేస్తోంది. కనుక ఈ పధకాన్ని సమాజంలో ఇతర కులమతాలవారు వ్యతిరేకిస్తున్నారనేది కేవలం దుష్ప్రచారం మాత్రమే. ఈ పధకాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. 

ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు సమాజంలో ప్రతీ ఒక్కరూ ఈ పధకం ద్వారా దళితుల ఎదుగుదలకు తోడ్పడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ పధకంలో లబ్దిదారులు చాలామంది డెయిరీ పరిశ్రమ పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కనుక రాష్ట్రంలో డెయిరీ పరిశ్రమ సామర్ధ్యం, పాల ఉత్పత్తుల సగటు వినియోగం, మార్కెటింగ్ తదితర అంశాలపై అధికారులు అధ్యాయనం చేసి లబ్దిదారులకు అవసరమైన సహాయసహకారాలు అందజేయాలని కోరుతున్నాను.  

ఇప్పుడు రాష్ట్రంలో మధిర నియోజకవర్గంలోని చింతకాని, తుంగతుర్తిలోని తిరుమలగిరి, అచ్చంపేటలోని చారగొండ, జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలాలలో ఈ పధకం అమలుకు ఈ నెలాఖరులోగా నిధులు విడుదల చేస్తాము. ఈ పధకం కోసం దళిత కుటుంబాలకు ప్రత్యేకంగా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించి వాటికే నేరుగా నిధులు విడుదల చేస్తాము,” అని సిఎం కేసీఆర్‌ చెప్పారు.