
బిజెపి అధిష్టానం ఆదేశం మేరకు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ శనివారం రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో భూపేంద్ర పటేల్‌ను శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. అహ్మదాబాద్‌లో ఆదివారం జరిగిన బిజెపి శాసనసభాపక్ష సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఆయన పేరును ప్రతిపాదించగా బిజెపి ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం 2.20 గంటలకు రాజ్‌భవన్‌లో ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. రెండు మూడు రోజులలో మంత్రివర్గం ఏర్పాటు చేసుకొంటారు.
విశేషమేమిటంటే, వార్డు కౌన్సిలర్ స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగిన ఆయన గతంలో ఎన్నడూ కనీసం మంత్రిగా చేయలేదు. మొట్టమొదటిసారిగా 2017 శాసనసభ ఎన్నికలలో ఘనవిజయం సాధించి శాసనసభలో అడుగుపెట్టి ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి అవుతున్నారు. ఇందుకు చాలా బలమైన కారణాలే ఉన్నాయి.
గతంలో నరేంద్రమోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు, భూపేంద్ర పటేల్ భూపేంద్ర అహ్మదాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. అప్పుడే ఆయన సమర్ధతను నరేంద్రమోడీ గుర్తించారు. రెండో దశ కరోనా సమయంలో గుజరాత్ రాష్ట్రం ఆక్సిజన్ కొరతతో అల్లాడుతున్నప్పుడు భూపేంద్ర పటేల్ ఆసుపత్రులకు వేల సంఖ్యలో ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేశారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి గట్టిగా కృషి చేశారు.
మరో బలమైన కారణం ఏమిటంటే, గుజరాత్ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగల పాటిదార్ (పటేల్) సామాజిక వర్గానికి చెందినవారు. కనుక ప్రధాని నరేంద్రమోడీ సూచన మేరకే భూపేంద్ర పటేల్ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారని భావించవచ్చు. తనకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు ఆయన ప్రధాని నరేంద్రమోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రహోంమంత్రి అమిత్ షాలకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.