బతుకమ్మ పండుగ సంబురాలు షురూ ఐనై

తెలంగాణా సంస్కృతి, సంప్రదాయాలకి అద్దం పట్టే బతుకమ్మ సంబురాల హడావుడి అప్పుడే రాష్ట్రంలో చాలా చోట్ల మొదలైపోయింది. తొమ్మిది రోజులపాటు సాగి దసరా రోజున ముగిసే బతుకమ్మ పండగ మొదటి నుంచి చివరివరకు అంతా మహిళల చేతుల మీదుగానే జరగడం దీనిలో ప్రత్యేకతగా చెప్పవచ్చు. అందమైన పూవులతో అలంకరించిన బతుకమ్మ చుట్టూ తిరుగుతూ మహిళలు పాడే పాటలలో వారి ఆలోచనలు, ఆశలు, ఆశయాలు, అందం, ఆనందం, సుఖదుఖాలు, కష్టాలు ఇలాగ వారి జీవితాలలో ప్రతీ చిన్న అంశాన్ని స్పర్శిస్తూ సాగుతాయి. ఆ పాటలు వారి అంతరంగానికి అద్దం పడతాయి. అందుకే బతుకమ్మ అంటే తెలంగాణా మహిళలకి అంత ఆసక్తి..అభిమానం..ఇష్టం. 

ఒకప్పుడు పాలకుల నిర్లక్ష్యం వలన తెలంగాణా పల్లెలకే పరిమితమైన బతుకమ్మ పండుగ, తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కవితక్క పుణ్యామాని తెలంగాణా ఉద్యమాలతో పట్టణాలకి, నగరాలకి కూడా వ్యాపించింది. తెలంగాణా కోసం ఉద్యమాలు జోరుగా సాగుతున్న సమయంలో వాటిలోకి ఎంట్రీ ఇచ్చిన కవితక్క ఆ ఉద్యమాలలోకి తెలంగాణా మహిళలు రావడానికి జంకుతున్నారని గ్రహించి, వారిని ఉద్యమంలోకి రప్పించేందుకు బతుకమ్మని ఆశ్రయించింది. గొప్పింటి బిడ్డలు బతుకమ్మ ఎత్తరనే అపోహని పటాపంచలు  చేస్తూ తనే స్వయంగా బతుకమ్మని ఎత్తి, చివరికి ఆ పండుగ పేరు చెపితే తనే అందరికీ గుర్తుకు వచ్చేంతగా కృషి చేశారు. 

ఒకప్పుడు స్వాతంత్ర్యోద్యమ సమయంలో బ్రిటిష్ వాళ్ళు భారతీయులని విభజించి పాలించు అనే సూత్రాన్ని అమలుచేసేవారు. దానికి విరుగుడుగానే బాల గంగాధర్ తిలక్, సామాజిక గణేష్ నవరాత్రి ఉత్సవాలని ప్రారంభించి, భారతీయుల మద్య ఐక్యత పెంచారు. తనకి ఆయనే స్ఫూర్తినిచ్చారని కవితక్క చెప్పుకొంది. 

ఆమె ప్రయత్నాలు మెల్లగా ఫలించి తెలంగాణా మహిళలు అందరూ బతుకమ్మ పండుగ కలిసి చేసుకోవడానికి ముందుకు రావడం మొదలుపెట్టారు. ఆవిధంగా దగ్గరవుతున్న వారిని ఆమె మెల్లగా తెలంగాణా ఉద్యమాలవైపుకి మళ్ళించగలిగారు. తెలంగాణా మహిళల సహకారం, భాగస్వామ్యం లేనిదే అంత ఉదృతంగా పోరాటాలు సాగేవి కావని చెప్పవచ్చు. 

చివరకి బతుకమ్మ దీవెనలతో తెలంగాణా రాష్ట్రం ఏర్పడింది. అప్పటి నుంచి తెలంగాణా ప్రభుత్వం బతుకమ్మ పండుగని చాలా ఘనంగా అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ ఏడాది బతుకమ్మ పండుగ నిర్వహణ కోసం రూ.9కోట్లు విడుదల చేసింది. అందుకు కూడా రాష్ట్రంలో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని తప్పు పట్టాయి. అది బతుకమ్మ కోసమా కవితక్క కోసమా? అని ప్రశ్నించాయి. ముఖ్యమంత్రి కూతురు, అధికారపార్టీ ఎంపిగా ఉన్న కవితక్కకి నిజంగా డబ్బు మీద అంత ఆశ ఉంటే ఆమెకి 9 కోట్లు సంపాదించుకోవడం ఓ లెక్కా? 

అచ్చమైన తెలంగాణావాసులైన కాంగ్రెస్, తెదేపా నేతలు తమ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ తెలంగాణా రాష్ట్రాన్నే పట్టించుకోలేదు. ఇక తెలంగాణా సంస్కృతీ సంప్రదాయాలకి అద్దం పట్టే బతుకమ్మ పండుగని ఎందుకు పట్టించుకొంటారు? కొమ్ములు తిరిగిన ప్రతిపక్ష పార్టీల నేతలు ఎవరూ చేయలేని పనిని కవితక్క చేసి చూపిస్తే దానికీ ఏడుస్తున్నారు. వారిని చూసి జాలిపడాల్సిందే. 

గత ఏడాది బతుకమ్మ పండుగని జాతీయ స్థాయిలో నిర్వహించి దేశ ప్రజలకి తెలంగాణా రాష్ట్ర ఉనికిని, దాని గొప్ప సంస్కృతీ సంప్రదాయాలని తెలియజేశారు. ఈసారి అంతర్జాతీయ స్థాయిలో జరిపేందుకు ఆమె ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి అమెరికా, ఇంగ్లాండ్, డెన్మార్క్, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, దుబాయి, బహ్రెయిన్, కువైట్ దేశాలలో బతుకమ్మ పండుగని నిర్వహించబోతున్నారు. దానికోసం ఆ పండుగ పాటల సీడిలని ఆ దేశాలలో తెలంగాణా ప్రజలకి చేరవేశారు. అంతేకాదు బతుకమ్మ పండుగ గురించి అన్ని వివరాలు తెలుసుకొనేందుకు బతుకమ్మ పేరిట ఒక యాప్ కూడా రూపొందించారు. 

భారతీయులకి ఎంతో ముఖ్యమైన దీపావళి పండుగ ప్రాధాన్యతని గుర్తించిన అమెరికా ప్రభుత్వం, ప్రతీ ఏటా వైట్ హౌస్ లో ఆ పండుగ జరుపుకొంటోంది. ఏదో ఒకరోజు బతుకమ్మ పండుగని కూడా జరుపుకొంటుందని కవితక్క ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న హిల్లరీ క్లింటన్ కి ఆమె దీని గురించి లేఖ వ్రాశారు కూడా.