రాజస్థాన్‌లో హైవేపై దిగిన యుద్ధవిమానాలు

భారత్‌ వాయుసేనకు చెందిన రెండు యుద్ధవిమానాలు, ఒక సరుకు రవాణా విమానం ఈరోజు రాజస్థాన్‌లోని జలోర్ అనే ప్రాంతంలో జాతీయ రహదారిపై దిగాయి. ఎప్పుడైనా శతృదేశాలు భారత్‌ వాయుసేనకు చెందిన ఎయిర్ బేస్‌ల రన్-వేలను ధ్వంసం చేస్తే అటువంటి అత్యవసర పరిస్థితులలో యుద్ధవిమానాలు జాతీయ రహదారులను ఉపయోగించుకోవచ్చనే ఆలోచన నుంచి పుట్టిందే నేడు చేస్తున్న ఈ ప్రయోగం. 

దీనిలో భాగంగా మొదట సైనికులను, ఆయుధాలను, సరుకులను రవాణా చేసే భారీ విమానం సీ-130జె హెర్క్యూలిస్ జాతీయ రహదారిపై దిగింది. విశేషమేమిటంటే, దీనిలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, ఉపరితల రవాణామంత్రి నితిన్ గడ్కారీ, ఎయిర్ చీఫ్ బదౌరియాలు ప్రయాణించారు. అంతా భారీ విమానం అలవోకగా జాతీయ రహదారిపై దిగి, వారిని క్షేమంగా గమ్యం చేర్చింది. దాని తరువాత సుఖోయ్ ఎస్‌యు-30 ఎంకేఈ ఫైటర్ జెట్ యుద్ద విమానం దూసుకువచ్చి జాతీయ రహదారిపై ల్యాండ్ అయ్యింది. దాని తరువాత జాగ్వార్ యుద్ధ విమానం అలవోకగా ల్యాండ్ అయ్యింది.  

దేశవ్యాప్తంగా వివిద రాష్ట్రాలలో 12 జాతీయ రహదారులను అత్యవసర పరిస్థితులలో యుద్ధవిమానాల ల్యాండింగ్, టేకాఫ్ కోసం వాడుకోవాలని రక్షణశాఖ నిర్ణయించింది. దానిలో భాగంగా 2015లో ఢిల్లీ శివారు నగరమైన నోయిదాను ఆగ్రాను కలిపే యమునా ఎక్స్‌ప్రెస్‌ హైవేపై మీరాజ్ యుద్ధ విమానాన్ని విజయవంతంగా ల్యాండింగ్, టేకాఫ్ చేశారు. ఆ తరువాత 2017లో మీరాజ్, సుఖోయ్, హెర్క్యూలిస్ యుద్ధ విమానాలను ఆగ్రా-లక్నో జాతీయరహదారిపై విజయవంతంగా ల్యాండింగ్, టేకాఫ్ చేసి చూశారు. ఇప్పుడు రాజస్థాన్‌ విజయవంతంగా పరీక్షించి చూశారు.