ఈటలను గెలిపిస్తే ఏం చేయగలరు?

మంత్రి హరీష్‌రావు బుదవారం వీణవంక మండలంలోని దేశాయిపల్లిలో ముదిరాజ్ కులస్తుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బిజెపి, ఈటల రాజేందర్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 

“ఈటల రాజేందర్‌ తన స్వార్ధం కోసమే ఈ ఉపఎన్నికలను తెచ్చారు. కానీ ఇప్పుడు ఓటమి భయంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆ భయంతోనే నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఓటర్లను ప్రలోభపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. మంత్రిగా ఉన్నప్పుడే నియోజకవర్గంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు కట్టించని ఈటల రాజేందర్‌, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండగా ఏవిదంగా కట్టించగలరు? నియోజకవర్గంలో సమస్యలను ఏవిదంగా తీర్చుతారు? ఏవిదంగా అభివృద్ధి చేయగలరు?” అని ప్రశ్నించారు. 

బిజెపి గురించి మాట్లాడుతూ, “బిజెపికి ఓట్లేస్తే ఈసారి గ్యాస్ సిలెండర్ ధర రూ.1,500కి పెంచుతుంది తప్ప ప్రజలకు ఏమీ చేయదు. ఈసారి బిజెపి నేతలు మిమ్మల్ని ఓట్లు అడగడానికి వస్తే దొడ్డు ధాన్యం కొనుగోలు చేస్తుందా?అని నిలదీసి అడగండి. బిజెపికి మీ ఓట్ల మీద ప్రేమే తప్ప మీపై లేదు,” అన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు ముదిరాజ్ కులస్తుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలుచేస్తున్న పలు సంక్షేమ పధకాల గురించి వివరించి టిఆర్ఎస్‌ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కే ఓట్లేసి గెలిపించాలని కోరారు. ఆయనను గెలిపిస్తే  ఇక్కడే మీ అందరికీ అందుబాటులో ఉంటూ నియోజకవర్గంలో అన్ని సమస్యలు పరిష్కరించి, అభివృద్ధి చేస్తారని, గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ తరపున హామీ ఇస్తున్నాని మంత్రి హరీష్‌రావు అన్నారు.