ఉత్తరాఖండ్ గవర్నర్ బేబీ రాణీ మౌర్య మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆమె తన రాజీనామా లేఖను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కు ఫాక్స్ ద్వారా పంపారు. ఆమె ఉత్తరాఖండ్ గవర్నర్ పదవి చేపట్టి మూడేళ్ళయింది. మరో రెండేళ్ళ వరకు ఆమె ఆ పదవిలో కొనసాగడానికి ఎటువంటి సమస్య లేదు. అయినా రెండేళ్ళ ముందుగానే రాజీనామా చేయడం విశేషం. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు ఆమె తన లేఖలో పేర్కొన్నారు.
యూపీ బిజెపికి చెందిన ఆమె గత శాసనసభ ఎన్నికలలో ఏత్మాద్‌పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కనుక వచ్చే ఏడాది జరుగబోయే యూపీ శాసనసభ ఎన్నికలలో మళ్ళీ పోటీ చేసేందుకే ఆమె తన పదవిని వదులుకొన్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దళితజాతికి చెందిన ఆమెకు బిజెపి యూపీ ఎన్నికలలో కీలక బాధ్యతలు అప్పగించబోతోందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. కనుక ఈ రెంటిలో ఏదో ఒక దాని కోసమె ఆమె రాజీనామా చేసి ఉండవచ్చు.