
వైఎస్సార్‌టిపి అధినేత్రి వైఎస్ షర్మిల రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకొన్న నిరుద్యోగుల కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ ప్రతీ మంగళవారం వారిని పరామర్శించి వారి ప్రాంతాలలో నిరుద్యోగదీక్షలు చేస్తున్నారు. అయితే తమ బిడ్డల చావులను ఆమె రాజకీయంగా వాడుకొంటున్నారని భావిస్తున్న నిరుద్యోగుల కుటుంబాలు ఆమె దీక్షల పట్ల విముఖత చూపుతున్నారు. కొంతమంది ఆమె వచ్చే ముందు తమ ఇంటికి తాళం వేసుకొని వెళ్లిపోతుండగా కొందరు ఆమెను తమ ఇంటికి రావద్దని ముందే చెపుతున్నారు. దీంతో కొన్నిసార్లు వారికీ వైసీపీ నేతలకు మద్య వాదోపవాదాలు కూడా జరుగుతున్నట్లు సమాచారం. మంచిర్యాల జిల్లా సిరిసేడులో ఆత్మహత్య చేసుకొన్న ఓ నిరుద్యోగి కుటుంబాన్ని గతవారం వైఎస్ షర్మిల పరామర్శించాలనుకోగా ఆమెను తమ ఇంటికి రావద్దని బాధిత కుటుంబ సభ్యులు ముందే చెప్పేశారు.
దీంతో వైఎస్ షర్మిల నేటి నుంచి బాధిత కుటుంబాల ప్రాంతాలలో కాకుండా యూనివర్సిటీల ప్రధానద్వారం ఎదుట దీక్షలు చేపట్టాలని నిర్ణయించారు. నేడు పాలమూరు యూనివర్సిటీ ఎదుట వైఎస్ షర్మిల నిరుద్యోగ దీక్ష చేయబోతున్నారు.