2.jpg)
రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్రలో భాగంగా సోమవారం సంగారెడ్డి జిల్లాలో సదాశివపేటలోని గాంధీ చౌక్ వరకు 7 కిమీ పాదయాత్ర చేశారు. అనంతరం అక్కడ జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ, “ప్రధాని నరేంద్రమోడీ అభినవ సర్ధార్ పటేల్‌లాగ హుందాగా వ్యవహరిస్తుంటే, సిఎం కేసీఆర్ నయా నిజాం నవాబులా వ్యవహరిస్తున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పధకం కింద రాష్ట్రానికి 2.40 లక్షల ఇళ్లను మంజూరు చేస్తే, ఇంతవరకు వాటిలో ఒక్కటీ పూర్తిచేయలేదు. 2016-2017లో కేంద్రం గ్రామపంచాయితీల కోసం రాష్ట్రానికి రూ.66 కోట్లు ఇస్తే దానిలో రూ.17 కోట్లకు ఇంతవరకు లెక్కలు చూపలేదు. అందువల్లే రాష్ట్రానికి రావలసిన రూ.950 కోట్లు కేంద్రం నిలిపివేసింది. కేంద్రం ఇస్తున్న నిధులను వాడుకొంటూనే అవన్నీ టిఆర్ఎస్ ప్రభుత్వమే ఇస్తున్నట్లు సిఎం కేసీఆర్ గొప్పలు చెప్పుకొంటున్నారు.
ప్రభుత్వోద్యోగులకు నెలనెలా సకాలంలో జీతాలు చెల్లించలేకపోతున్న రాష్ట్ర ప్రభుత్వం, దళిత బంధు పధకానికి లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తుంది?ఎలా ఇస్తుంది? హుజూరాబాద్‌లో ఓడిపోతామనే భయంతోనే సిఎం కేసీఆర్ ఉపఎన్నికను వాయిదా వేయించారు. హుజూరాబాద్‌లో మాత్రమే కాదు రాబోయే శాసనసభ ఎన్నికలలో కూడా టిఆర్ఎస్‌ను ఓడించి రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం. గోల్కొండ కోటపై కాషాయజెండా ఎగురవేస్తాం. అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించి అందరినీ జైలుకి పంపడం ఖాయం,” అని బండి సంజయ్ అన్నారు.