తీన్‌మార్ మల్లన్నకు రౌడీషీటర్‌ శంకర్‌కు సంబందం ఏమిటి?

సికింద్రాబాద్‌లోని లక్ష్మీకాంత శర్మ అనే జ్యోతిష్యుడి ఫిర్యాదు మేరకు చిలకలగూడా పోలీసులు క్యూన్యూస్ యూ ట్యూబ్ ఛానల్‌ అధినేత చింతపండు నవీన్ అలియాస్ తీన్‌మార్ మల్లన్నపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తీన్‌మార్ మల్లన్న తనను రూ.30 లక్షలు ఇమ్మని బెదిరిస్తూ ఏప్రిల్ 17న వాట్సాప్‌లో సందేశం పంపించాడని లక్ష్మీకాంత శర్మ పిర్యాదులో పేర్కొన్నారు. 

కోర్టు అనుమతితో పోలీసులు తీన్‌మార్ మల్లన్నను మూడు రోజులు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా ఇదే కేసుకు సంబందించి అంబర్‌పేటకు చెందిన శంకర్ అనే ఓ రౌడీషీటర్‌ను కూడా ఆదివారం పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి ప్రశ్నించారు. తీన్‌మార్ మల్లన్న సూచన మేరకు తాను లక్ష్మీకాంత శర్మతో మాట్లాడానని శంకర్ చెప్పాడు. అయితే వారిరువురికి తన మధ్యవర్తిత్వం ఫలించలేదని, ఇంతకుమించి తనకు ఏమీ తెలీదని శంకర్ చెప్పాడు. పోలీసులు అతని వాంగ్మూలాన్ని నమోదు చేసుకొన్నారు. తీన్‌మార్ మల్లన్న కూడా తాను లక్ష్మీకాంత శర్మతో సంప్రదింపులు చేసినట్లు ఒప్పుకొన్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే ఆయన రాజకీయ జీవితం ఇంకా ప్రారంభం కాకమునుపే ముగిసిపోయినా ఆశ్చర్యం లేదు.