ఈనెల 15 నుంచి శాసనసభ సమావేశాలు?

తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈనెల 15వ తేదీ లేదా ఒకటి రెండు రోజులు ముందుగా మొదలయ్యే అవకాశం ఉంది. రాజ్యాంగం ప్రకారం ప్రతీ ఆరు నెలలకి ఓసారి శాసనసభ సమావేశాలు నిర్వహించవలసి ఉంటుంది. ఇదివరకు మార్చి 15 నుంచి 26 వరకు శాసనసభ సమావేశాలు జరిగాయి. కనుక ఎట్టి పరిస్థితులలో సెప్టెంబర్ 15 లేదా ఇంకా ముందుగానే శాసనసభ సమావేశాలు ప్రారంభించవలసి ఉంటుంది. నేడో రేపో సిఎం కేసీఆర్‌ ఢిల్లీ నుంచి తిరిగి రాగానే శాసనసభ సమావేశాలపై మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకొంటారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గినప్పటికీ ఇంకా కరోనా వెంటాడుతూనే ఉన్నందున ఈసారి కూడా సమావేశాలు వారం పది రోజులు మాత్రమే నిర్వహించవచ్చు. 

ఈసారి సమావేశాలలో ప్రధానంగా హుజూరాబాద్‌ ఉపఎన్నిక, దళిత బంధు పధకం, దానికి నిధుల కేటాయింపు, భారీ వర్షాలతో మళ్ళీ హైదరాబాద్‌ నగరం నీట మునుగడం, బండి సంజయ్‌ పాదయాత్ర, కాంగ్రెస్‌ దండోరా సభలు తదితర అంశాలపై అధికార, ప్రతిపక్షాల మద్య వాడివేడిగా చర్చలు జరిగే అవకాశం ఉంది. అలాగే దళిత బంధు పధకానికి చట్టబద్దత కల్పించవలసి ఉంటుంది.