తెలంగాణావాసులు చాలా మంది ఉద్యోగరీత్యా విదేశాలలో స్థిరపడినప్పటికీ వారి మనసులలో తెలంగాణా రాష్ట్రం కోసం ఏదో ఒకటి చేయాలనే తపన కనిపిస్తూనే ఉంటుంది. ఆ తపనతోనే అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (ఆప్త)-జనమైత్రి పోలిస్ అధ్వర్యంలో అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా అదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ మండలంలో మారుమూల గ్రామమైన రాజురాలో చాలా భారీ స్థాయిలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించబోతున్నారు. స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణలో ఉదయం 8 నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించబోయే ఈ వైద్య శిబిరం ద్వారా రాజురా గ్రామంతో సహా చుట్టుపక్కల గ్రామాలలో నివసిస్తున్న 2,000 మంది గ్రామీణులకి ఉచిత వైద్యం, మందులు అందించబోతున్నారు.
జిల్లాలో ఆ మారుమూల ప్రాంతాలలో ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించిన జిల్లాకి చెందిన డా. వేణు గోపాల్, డా. కృష్ణంరాజు, డా. రామకృష్ణ తదితరులు ఆ విషయం ఆప్తకి తెలియజేయగా, ఆప్త సంస్థ అధ్యక్షులు గోపాల గూడపాటి, ఆప్త మెడికల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ చైర్ డా.కుమార్ కొత్తపల్లి వెంటనే స్పందించి ఈ విద్య శిబిరం నిర్వహణకి ఏర్పాట్లు చేశారు. ఆప్త వైసిపి-చైర్మన్ వైస్ చైర్ డా. సూర్య రగుతూ ఈ వైద్య శిబిరంలో రోగులకి అవసరమైన అన్ని రకాల మందులు అందిస్తున్నారు. వారందరి చొరవ, పట్టుదల కారణంగా ఈ వైద్య శిబిరంలో ఏకంగా 20 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు రోగులకి ఉచితంగా వైద్యసేవలు అందించడానికి అంగీకరించారు.
రోగులకి ఉచిత వైద్యం, మందులు, భోజనం అందించడమే కాకుండా చుట్టూ పక్కల గ్రామాల నుంచి ప్రజలు వైద్య శిబిరానికి చేరుకోవడానికి వాహనాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు గోపాల గూడపాటి తెలిపారు. జనార్ధన్ పన్నెల అధ్వర్యంలో నడుస్తున్న శాంతి నికేతన్ సంస్థ ఈ వైద్య శిబిరం నిర్వహణకి అవసరమైన సహాయసహకారాలు అందిస్తుంది. ఖానాపూర్ మండలంలో ప్రజలందరూ ఈ ఉచిత వైద్య సేవలని వినియోగించుకోవలసిందిగా ఆప్త సంస్థ ఉపాధ్యక్షులు జిడుగు సుబ్రహ్మణ్యం పత్రికాముఖంగా కోరారు. మరిన్ని వివరాలకి శాంతి నికేతన్ లేదా ఆప్తాని సంప్రదించవలసిందిగా కోరారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా స్థానిక శాసనసభ్యురాలు రేఖాశ్యాం నాయక్ వస్తున్నారు. ఒక ఎన్.ఆర్.ఐ. సంస్థ రాష్ట్రంలో ఇంత మారుమూల ప్రాంతంలో ఈ స్థాయిలో ఉచితవైద్య శిబిరం నిర్వహించడం చాలా అభినందనీయం. మున్ముందు వారి సేవలని మరిన్ని గ్రామాలకి విస్తరించాలని ఆశిద్దాం.