
హుజూరాబాద్ ఉపఎన్నికలో టిఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను గెలిపించుకోవడం కోసం మంత్రి హరీష్‌రావు రంగంలో దిగడంతో ఆయనకు, ఈటల రాజేందర్‌కు మద్య మాటల యుద్ధం జరుగుతోంది. మంత్రి హరీష్‌రావు తనపై చేస్తున్న తీవ్ర విమర్శలు, ఆరోపణలపై ఈటల రాజేందర్ నిన్న స్పందిస్తూ, “ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎసరు పెట్టేందుకు నేను కాదు నువ్వే ప్రయత్నించిన సంగతి అందరికీ తెలుసు. నీకు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలకు డబ్బు పంచి మామకు ఎసరు పెట్టాలనుకొన్నావు. అందుకే ఆయన నిన్ను దూరం పెట్టారు. కానీ నేను ‘మేము కూడా గులాబీ జెండా యజమానులం...’ అంటూ గట్టిగా మాట్లాడగానే నీ మామ మళ్ళీ నీకు మంత్రి పదవి ఇచ్చి దగ్గరకు చేసుకొన్నారు. కనుక నా వలనే నీకు ఆ మంత్రి పదవి వచ్చిందని తెలుసుకో.
అటువంటి నువ్వు నా నియోజకవర్గానికి వచ్చి నాపై అసత్య ఆరోపణలు చేస్తూ నా ప్రతిష్టకు భంగం కలిగించాలని ప్రయత్నిస్తుంటే నేను చేతులు ముడుచుకొని కూర్చోను. నీ ఎత్తులు, జిత్తులు అన్ని నాకు తెలుసు. వాటిని తిప్పి కొడతాను. త్వరలోనే నీ బండారం బయట పెడతాను. ఇక్కడకు వచ్చి నన్ను బదనామ్ చేయడం కాదు చివరికి నువ్వే నవ్వులపాలయ్యి తిరిగివెళతావు. హుజూరాబాద్ నుంచే నీ పతనం, నీ పార్టీ పతనం మొదలవుతుంది. ఈ ఉపఎన్నికలో నేనే తప్పకుండా గెలుస్తాను. ఒకవేళ నేను ఈ ఉపఎన్నికలో ఓడిపోతే రాజకీయాల నుంచి శాశ్వితంగా తప్పుకొంటాను. టిఆర్ఎస్ ఓడిపోతే తప్పుకోవడానికి నువ్వు సిద్దమేనా?” అంటూ ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో మంత్రి హరీష్‌రావుపై విరుచుకుపడ్డారు.