
సిఎం కేసీఆర్ ఈరోజు మధ్యాహ్నం దేశ రాజధాని ఢిల్లీలో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి (తెలంగాణ భవన్) శంఖుస్థాపన చేశారు. ఢిల్లీలో వసంత్ విహార్ మెట్రో రైల్వేస్టేషన్‌కు సమీపంలో 1,300 చదరపు గజాల విస్తీర్ణంలో అత్యాధునిక సౌకర్యాలతో దీనిని నిర్మించబోతున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ ఆలీ, టిఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీలో తెలుగు మీడియాతో మాట్లాడుతూ, “20 ఏళ్ళ క్రితం కేసీఆర్ వేసిన తొలి అడుగుతో మొదలైన టిఆర్ఎస్ ప్రస్థానం నేడు ఢిల్లీకి చేరుకొంది. దేశరాజధాని ఢిల్లీలో మన పార్టీ కార్యాలయం నిర్మించుకోబోతుండటం నాకు చాలా సంతోషం కలిగిస్తోంది. దక్షిణాది ప్రాంతీయ పార్టీలలో ఢిల్లీలో కార్యాలయం కలిగిన వాటిలో టిఆర్ఎస్ రెండోది. ఇది మన అందరికీ గర్వకారణం. టిఆర్ఎస్ రాజకీయ అస్తిత్వమే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్షగా నిలుస్తుంది. దేశరాజధానిలో రెపరెపలాడుతున్న మన గులాబీ జెండా తెలంగాణ ప్రజలందరి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుంది....భరోసా కల్పిస్తుంది,” అని అన్నారు.