బండి పాదయాత్ర చేస్తే టిఆర్ఎస్‌ ఎందుకు భయపడుతోంది?

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజా సంగ్రామయాత్ర పేరిట చేస్తున్న పాదయాత్రలో బిజెపి కార్యకర్తలు తప్ప ప్రజలెవరూ పాల్గొనడం లేదని టిఆర్ఎస్‌ నేతలు ఎద్దేవా చేశారు. దీనిపై దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందిస్తూ, “బండి సంజయ్‌ పాదయాత్ర చేస్తుంటే టిఆర్ఎస్‌ నేతలు ఎందుకు భయపడుతున్నారు?ఒకవేళ ఆయన పాదయాత్రలో బిజెపి కార్యకర్తలు తప్ప ప్రజలెవరూ లేనట్లయితే మేము బాధపడాలి కానీ టిఆర్ఎస్‌ నేతలు ఎందుకు భుజాలు తడుముకొంటున్నారు? బండి సంజయ్‌ పాదయాత్రతో తమ పార్టీ పునాదులు కదిలిపోతాయని టిఆర్ఎస్‌ భయపడుతోంది కనుకనే విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో ఆయన పాదయాత్ర ముగిసేసరికి నిజంగానే టిఆర్ఎస్‌ పీఠం దద్దరిల్లుతుంది,” అని అన్నారు.  

సిఎం కేసీఆర్‌ నేడు ఢిల్లీలో టిఆర్ఎస్‌ కార్యాలయానికి శంఖుస్థాపన చేస్తుందతంపై స్పందిస్తూ, “నిత్యం కేంద్రప్రభుత్వాన్ని, జాతీయ పార్టీలను తిట్టిపోస్తుండే టిఆర్ఎస్‌కు ఢిల్లీలో పార్టీ కార్యాలయం ఎందుకు?మేము ఢిల్లీకి బానిసలమని విమర్శించే టిఆర్ఎస్‌ కూడా ఇప్పుడు డిల్లీలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకొని ఢిల్లీకి బానిసగా మారాలనుకొంటోందా?” అని ఎద్దేవా చేశారు.