ఆ నాలుగు మండలాలో దళితులు ఇక లక్షాధికారులే!

దళిత బంధు పధకంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలకు సమాధానం చెప్పేందుకు సిఎం కేసీఆర్‌ ఈరోజు కీలక నిర్ణయం తీసుకొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ప్రాంతాలలోని దళిత ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు మండలాలో దళిత బంధు పధకాన్ని అమలుచేయాలని నిర్ణయించారు. వాటిలో ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం, సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం, నాగర్‌కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గంలోని చారగొండ మండలం, కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలాలను ఎంపిక చేశారు. ఈ నాలుగు మండలాల పరిధిలోని గ్రామాలలో నివశిస్తున్న దళిత కుటుంబాలకు ఈ పధకామ్ ద్వారా రూ.10 లక్షల చొప్పున ప్రభుత్వం అందజేస్తుంది. సిఎం కేసీఆర్‌ నేడు ఢిల్లీ వెళుతున్నారు. రేపు ఢిల్లీలో టిఆర్ఎస్‌ కార్యాలయానికి భూమిపూజ చేస్తారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌ తిరిగివచ్చాక, ఆయా జిల్లాల మంత్రులు, కలెక్టర్లు, నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలతో సమావేశమై చర్చించిన తరువాత ఆ నాలుగు మండలాలో ఈ పధకాన్ని అమలుచేయనున్నారు. ఆలోగా జిల్లా కలెక్టర్లు అర్హులైన లబ్దిదారులను గుర్తించి జాబితాలను సిద్దం చేస్తారు. 

సిఎం కేసీఆర్‌ వాసాలమర్రి గ్రామంలో పర్యటించినప్పుడు, అక్కడి దళితులతో మాట్లాడుతూ, “నా నోటి నుంచి ఈ మాటలు వెలువడిన మరుక్షణం నుంచి మీరందరూ లక్షాధికారులైపోతారు,” అని అన్నారు. అన్నట్లుగానే మార్నాడు ఉదయం 11 గంటలకల్లా 78 దళిత కుటుంబాల బ్యాంక్ ఖాతాలలో పడేసి లక్షలు చొప్పున జమా అయ్యాయి.   

అదేవిదంగా ఇప్పుడు సిఎం కేసీఆర్‌కు ఈ ఆలోచన వచ్చిన మరుక్షణం నుంచి ఆ నాలుగు మండలాలలో దళితులు లక్షాధికారులు అయిపోయినట్లే! కలలో కూడా ఊహించనంత సొమ్ము (మళ్ళీ తిరిగి చెల్లించనవసరం లేకుండా) వచ్చి ఒళ్ళో పడుతోంది కనుక వారంత అదృష్టవంతులు మరొకరు ఉండరనే భావించవచ్చు.