సెప్టెంబర్ 2న జెండా పండుగ ఘనంగా జరుపుకోవాలి: కేటీఆర్‌

టిఆర్ఎస్‌ ఏప్రిల్ 27, 2001లో ఆవిర్భవించింది. అయితే కరోనా కారణంగా పార్టీ వార్షికోత్సవం (ప్లీనరీ సభ)ను నిర్వహించలేకపోయింది. కనుక పార్టీ ఆవిర్భవించి 20 సం.లు పూర్తయినందున సెప్టెంబర్ 2వ తేదీన టిఆర్ఎస్‌ జెండా పండుగ జరుపుకోవాలని ఆ పార్టీ తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆరోజున రాష్ట్రవ్యాప్తంగా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయివరకు పార్టీ జెండాలు ఎగురవేసి జెండా పండుగ జరుపుకోవాలని కోరారు. అదే రోజున సిఎం కేసీఆర్‌ ఢిల్లీలో వసంత్ విహార్ మెట్రో స్టేషన్ సమీపంలో టిఆర్ఎస్‌ పార్టీ కార్యాలయానికి భూమిపూజ చేయనున్నారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 

సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు గ్రామ, వార్డు కమిటీలను ఏర్పాటు చేసుకొని 12 నుంచి 20 వరకు మండల, పట్టణ స్థాయి కమిటీలను ఏర్పాటుచేసుకోవాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. సెప్టెంబర్ 2వ తేదీ తరువాత జిల్లాస్థాయి కార్యవర్గాలు వాటి అధ్యక్షుల పేర్లను ఖరారు చేసి ప్రకటిస్తామని తెలిపారు. పార్టీ పునర్నిర్మాణ ప్రక్రియలో పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకత్వం చర్చించుకొని నిర్ణయిస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 

సిఎం కేసీఆర్‌ ఢిల్లీ నుంచి తిరిగివచ్చిన తరువాత కొత్తగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులతో, జిల్లా కార్యవర్గ సభ్యులతో సమావేశమవుతారని తెలిపారు. వారితో చర్చించిన తరువాత రాష్ట్ర కార్యవర్గాన్ని సిఎం కేసీఆర్‌ ప్రకటిస్తారని తెలిపారు.   

హైదరాబాద్‌ నగరంలో డివిజన్ల వారీగా కమిటీలతో పాటు, బస్తీ కమిటీలను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. వచ్చేనెల మొదటివారంలో నగరామ్లోని ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, నియోజకవర్గం ఇన్‌చార్జిలతో సమావేశం నిర్వహించి కమిటీల ఏర్పాటుపై చర్చించి నిర్ణయం తీసుకొంటామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.    

గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీల కూర్పుపై మంత్రి కేటీఆర్‌ కొన్ని సూచనలు చేశారు. 

• గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతీ కమిటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం తప్పనిసరిగా కేటాయించాలి లేకుంటే ఆ కమిటీలకు గుర్తింపు లభించదు.

• అన్ని కమిటీలలో మహిళా సభ్యులకు తప్పనిసరిగా స్థానం కల్పించాలి. 

• పార్టీలో క్రియాశీలక సభ్యత్వం ఉన్నవారికి మాత్రమే కమిటీలలో తీసుకోవాలి. 

• ఈసారి గ్రామ, మండల స్థాయిలో కూడా సోషల్ మీడియా కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి.