దళిత బంధు, బీసీ బంధు ఇంకా చాలా ఉన్నాయి: కేసీఆర్‌

తెలంగాణ భవన్‌లో నిన్న జరిగిన టిఆర్ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యవర్గసమావేశంలో సిఎం కేసీఆర్‌ దళిత బంధు పధకంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలు, సవాళ్ళకు తనదైన శైలిలో సమాధానం చెప్పారు. “దేశంలో అట్టడుగు స్థాయిలో ఉన్న దళితులను ఆదుకోవడానికి ఏ పార్టీ... ప్రభుత్వమూ ఇటువంటి ఆలోచన చేయలేకపోయింది. కానీ మనం రాష్ట్రంలో దళిత బంధు పధకం ప్రవేశపెట్టగానే ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. అవి దశాబ్ధాలుగా చేయలేని ఆలోచనని మనం అమలుచేస్తున్నందుకే ఈర్ష్యతో విమర్శలు చేస్తున్నాయి. అందుకే గిరిజన బందు, బీసీ బంధు ఇంకా ఏవేవో బంధులు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నాయి. అయితే రాష్ట్రంలో ఏమి చేయాలన్నా మనమే చేయాలి. ఎందుకంటే మరో 20 ఏళ్ళు వరకు మనమే అధికారంలో ఉంటాము. మరే పార్టీ ఇవన్నీ చేయలేదు. తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్రంలో అన్నివర్గాల అభ్యున్నతి కోసం రకరకాల పధకాలు, కార్యక్రమాలు అమలుచేస్తున్నాం. మున్ముందు మరిన్ని అమలుచేస్తాం.

ప్రతిపక్షాలు ఊహించనివిదంగా రాష్ట్రంలో ఇదివరకు రైతు బంధు ప్రవేశపెట్టాము. ఇప్పుడు దళిత బంధు పధకం ప్రవేశపెట్టాము. రాష్ట్రంలో అన్ని వర్గాలలో పేదలున్నారు. వారినందరినీ ఆదుకోవలసిన బాధ్యత మనపై ఉంది. కనుక మున్ముందు వారందరి కోసం కూడా ఇటువంటి పధకాలను ప్రవేశపెడతాం. సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్నవారిని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి బంధు పధకాలు రూపొందించి అమలుచేస్తాం. కనుక కొంచెం ముందువెనుకగా సమాజంలో అందరినీ పైకి తీసుకువచ్చేందుకు కృషిచేస్తాం,” అని అన్నారు.