భారత్ ఆర్మీ నిన్న అర్ధరాత్రి పాక్ అధీనంలో ఉన్న లైన్ ఆఫ్ కంట్రోల్ భూభాగంలోకి ప్రవేశించి అక్కడ ఉన్న ఏడు ఉగ్రవాద శిభిరాలపై దాడులు చేశారు. ఆ మెరుపుదాడిలో సుమారు 38 మంది ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. నిన్న అర్ధరాత్రి నుంచి ఈరోజు తెల్లవారు జాము 4.30 గంటల వరకు ఈ దాడులు జరిపామని, ఉగ్రవాదులని మట్టుబెట్టిన భారత సైనికులు అందరూ తిరిగి క్షేమంగా ఆర్మీ క్యాంప్ కి చేరుకొన్నట్లు లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ (డిజిఎంఒ) మీడియాకి తెలిపారు.
ఈ మెరుపు దాడులపై పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ స్పందిస్తూ “అవి భారత్ చెప్పుకొంటున్నట్లు మెరుపు దాడులు కావు. సరిహద్దుల వద్ద జరిగిన కాల్పులు మాత్రమే. దానిలో మా దేశానికి చెందిన ఇద్దరు సైనికులు మరణించారు. కొంత మంది గాయపడ్డారు. భారత్ తో మేము స్నేహమే కోరుకొంటున్నాము. కానీ ఈవిదంగా కవ్వింపు చర్యలకి పాల్పడితే మేము దీటుగా స్పందించవలసి వస్తుంది,” అని అన్నారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని భీంబర్, ఖేల్, లిఫా మరియు హాట్ స్ప్రింగ్ సెక్టార్లలో ఈ మెరుపు దాడులు నిర్వహించారు. పాక్ రాడార్ల కంటపడకుండా అక్కడికి చేరుకొనేందుకు ఆర్మీ హెలికాఫ్టర్లు చాలా తక్కువ ఎత్తులో ప్రయాణించినట్లు సమాచారం. భారత సైనికులు పారాచూట్ల సహాయం ఆ ప్రాంతాలలో దిగి ముందే గుర్తించిన నిర్దిష్ట లక్ష్యాలవైపు చురుకుగా కదిలి ఉగ్రవాదులు ఏమి జరుగుతోందో తెలుసుకొనేలోగానే వారిపై దాడులు చేసి మట్టుబెట్టారు.