
కరోనా, లాక్‌డౌన్ కారణంగా కేంద్రప్రభుత్వం ఆదాయం గణనీయంగా తగ్గిపోవడంతో ‘నేషనల్ మోనిటైజేషన్ పైప్‌లైన్’ (ఎన్‌ఎంపి) అనే పేరుతో ఆదాయం పెంచుకొనేందుకు దేశంలో అతిప్రధానమైన వ్యవస్థలన్నిటినీ ప్రైవేట్ సంస్థలకు లీజుపై ఇచ్చేందుకు సిద్దపడుతోంది. కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ నిన్న ఢిల్లీలో ఈవిషయం ప్రకటించారు.
దీనిలో భాగంగా రైల్వే స్టేషన్లు, రైళ్లు, విమానాశ్రయాలు, పోర్టులు, విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, స్టేడియంలు, ప్రభుత్వ రంగ సంస్థల అధ్వర్యంలో నడుస్తున్న హోటల్స్, హౌసింగ్ ప్రాజెక్టులు, సహజవాయువు పైప్ లైన్స్, మైనింగ్, గోదాములు, టెలికాం, రోడ్లు తదితర వ్యవస్థలలో పెద్దగా ఆదాయంలేని వాటిని ప్రైవేట్ సంస్థలకు దీర్గకాలం లీజుపై ఇవ్వబోతున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. రాబోయే నాలుగేళ్ళ వ్యవధిలో వీటిద్వారా రూ. 6 లక్షల కోట్లు ఆదాయం సమకూర్చుకొని దాంతో దేశవ్యాప్తంగా మౌలిక వసతులు ఏర్పాటు చేసేందుకు వినియోగించాలనుకొంటున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.
అయితే వివిద వ్యవస్థలలోని ఆస్తులను లీజుకి ఇచ్చినప్పటికీ వాటి యాజమాన్యపు హక్కులు కేంద్రప్రభుత్వం వద్దనే ఉంటాయని, లీజు గడువు పూర్తయిన తరువాత వాతీ తిరిగి కేంద్రప్రభుత్వానికి స్వాధీనపరిచే విదంగా లీజు అగ్రిమెంట్స్ ఉంటాయని ఆమె తెలిపారు. కనుక కేంద్ర ప్రభుత్వం దేశంలో విలువైన ఆస్తులు, వ్యవస్థలను ప్రైవేట్ పరం చేస్తోందని ఆందోళన చెందనవసరంలేదని అన్నారు. నిరర్ధక ఆస్తుల నుంచి ప్రైవేట్ భాగస్వామ్యంతో ఆదాయం సమకూర్చుకోవడమే ఎన్‌ఎంపి ప్రధానోదేశ్యమని నిర్మలా సీతారామన్ అన్నారు.