దళిత బంధుకు మరో రూ.500 కోట్లు విడుదల

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పధకం కోసం మరో రూ.500 కోట్లు విడుదల చేసింది. రెండు మూడు రోజులలో ఈ సొమ్ము హుజూరాబాద్‌లోని దళిత లబ్దిదారుల బ్యాంక్ ఖాతాలలో జమా చేయబడుతుంది. హుజూరాబాద్‌లో దళిత బంధు పధకం అమలుకొసం మొత్తం రూ.2,000 కోట్లు ఇస్తామని సిఎం కేసీఆర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. దానిలో ఇప్పటికే రూ.500 కోట్లు విడుదల చేయగా శనివారం మరో రూ.500 కోట్లు విడుదల చేయడంతో మొత్తం రూ.1,000 కోట్లు విడుదలచేసినట్లయ్యింది. మరో వారం పదిరోజులలో మిగిలిన రూ.1,000 కోట్లు కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం.   

ఈనెల 16వ తేదీన సిఎం కేసీఆర్‌ హుజూరాబాద్‌ బహిరంగ సభ నిర్వహించి దళిత బంధు పధకం పైలట్ ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. హుజూరాబాద్‌లో మొత్తం 29,000 దళిత కుటుంబాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారందరికీ కూడా ఈ పధకం ద్వారా ఆర్ధికసాయం అందజేస్తామని సిఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఆ తరువాత రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ఈ పధకాన్ని అమలుచేస్తామని, రాబోయే 4-5 ఏళ్లలో రాష్ట్రంలో దళితులందరికీ ఈ పధకం ద్వారా ఆర్ధికసాయం అందజేస్తామని మంత్రులు, ఎమ్మెల్యేలు చెపుతున్నారు.