హుజూరాబాద్‌లో డిపాజిట్ దక్కించుకో...రేవంత్‌ రెడ్డి: టిఆర్ఎస్‌

రేవంత్‌ రెడ్డి విమర్శలపై టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, పీయీసీ ఛైర్మన్‌ ఏ జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. 

గువ్వల బాలరాజు నిన్న టీఆర్‌ఎస్‌ఎల్పీలో మీడియాతో మాట్లాడుతూ, “ఒకప్పుడు ప్రింటింగ్ ప్రెస్సులో పనిచేస్తూ గోడలపై రాతలు రాసుకొని బ్రతికే రేవంత్‌ రెడ్డి వేలకోట్లు ఎలా సంపాదించాడు?అటువంటి వ్యక్తి తన స్థాయిని మరిచి సిఎం కేసీఆర్‌ గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. రేవంత్‌ రెడ్డి నోరు అదుపులో పెట్టుకొంటే మంచిది లేకుంటే తగిన విదంగా బుద్ది చెపుతాము. మేము తలుచుకొంటే గజ్వేల్ నియోజకవర్గంలో కాలు పెట్టలేవు. పిసిసి అధ్యక్ష పదవి లభించగానే కొత్త బిచ్చగాడిలా వ్యవహరిస్తున్నావు. నిజంగా నీకు దమ్ముంటే నీ ఎంపీ పదవికి రాజీనామా చేయి. అప్పుడు ఎవరి సత్తా ఎంతో తేల్చుకొందాం. హుజూరాబాద్‌లో పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్ధి కూడా దొరకడం లేదు. హుజూరాబాద్‌ ఉపఎన్నికలో మీ పార్టీకి డిపాజిట్ దక్కించుకొని చూపించు,” అంటూ సవాల్ విసిరారు. 

ఏ జీవన్ రెడ్డి మాట్లాడుతూ, ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన రేవంత్‌ రెడ్డి త్వరలోనే జైలుకి వెళ్ళడం ఖాయం. కనీసం అప్పటివరకైనా పిసిసి అధ్యక్షుడిగా హుందాగా వ్యవహరించాలని రేవంత్‌ రెడ్డికి హితవు పలికారు.