తెరాస ఒకటనుకొంటే..జరుగుతున్నది మరొకటి

తెలంగాణాలో తెరాసకి ఎదురు ఉండకూడదని ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రంలో ప్రతిపక్షాలని నిర్వీర్యం చేస్తే, అవి చినుకులు పడితే గడ్డి మొలిచి ఏపుగా ఎదిగినట్లుగా, తెరాస సర్కార్ వరుసగా ఇస్తున్న అవకాశాలతో మళ్ళీ బలం పుంజుకోవడమే కాకుండా తిరిగి తెరాసకి గట్టి సవాళ్ళు విసురుతున్నాయి. 

తెలంగాణా ఏర్పడినప్పటి నుంచి ఇంతవరకు జరిగిన ప్రతీ ఎన్నికలలో తెరాస విజయపధంలో దూసుకుపోగలిగింది. ఎన్నికలని హ్యాండిల్ చేయడంలో ముఖ్యమంత్రి కెసిఆర్ మంచి శక్తియుక్తులే చూపిస్తున్నారు కానీ పాలనాపరమైన విషయాలలో ఇంకా తడబడుతున్నట్లు కనిపిస్తుంది. అందుకే తెరాస సర్కార్ కి నిత్యం ఏవో ఒక  కష్టాలు తప్పడం లేదు. అవి ఒక దాని తరువాత మరొకటిగా ఒక ‘సైకిల్’ (చక్రం) లాగ వస్తూనే ఉన్నాయి తప్ప  వాటికీ ఎక్కడా బ్రేక్ పడటం లేదు. ప్రతిపక్షాల శక్తియుక్తులు, సమర్ధత కంటే తెరాస సర్కార్ స్వయంకృతాపరాదమే అందుకు కారణం కావడం చిత్రంగా ఉంది. అది కూడా తెలంగాణా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సాగునీటి ప్రాజెక్టుల విషయంలోనే తరచూ ప్రతిపక్షాలకి దొరికిపోవడం ఇంకా ఆశ్చర్యం కలిగిస్తోంది.

ప్రాజెక్టులపై ప్రతిపక్షాలు చేస్తున్న అవినీతి ఆరోపణలకి తెరాస సర్కార్ సంప్తికరమైన సమాధానాలు చెప్పుకోలేకపోవడం, భూసేకరణ కోసం జీవో జారీ చేయడం, ఆ వ్యవహారంలో నిర్వాసితులు, ప్రతిపక్షాలు, న్యాయస్థానాలలో వ్యతిరేకత ఎదుర్కోవలసి రావడం, మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూసేకరణ విషయంలో గోప్యత పాటించడం, తాజాగా మిడ్ మానేరుకి గండి పడటం వంటివన్నీ ప్రతిపక్షాలకి బలమైన ఆయుధాలుగా మార్చుకోన్నాయి. వాటితో అవి చేస్తున్న దాడులని తట్టుకోలేక తెరాస సర్కార్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. చివరికి అది ప్రొఫెసర్ కోదండ రామ్ ని కూడా ఎదుర్కోవలసివస్తోంది. 

ఇటీవల బారీ వర్షాలతో తెరాస సర్కార్ కి సంబంధం లేకపోయినా అవి కూడా దానికి శాపంగా మారడం, తీరని అప్రదిష్ట కలిగించడం దురదృష్టం కాకపోతే మరేమిటి? మళ్ళీ ఇప్పుడు ఆక్రమణలు తొలగిస్తున్నందుకు భాదిత ప్రజల నుండి శాపనార్థాలు ఎదుర్కోవలసి వస్తోంది. హైదరాబాద్ నగరంలో రోడ్ల పరిస్థితికి సంబంధిత శాఖల అధికారుల వైఫల్యం, అశ్రద్ద లేదా నిర్లక్ష్యానికి కూడా తెరాస సర్కారే విమర్శల పాలయింది. 

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో ఘన విజయం సాధించిన తరువాత ఇక రాష్ట్రంలో తనకు ఎదురే లేదని భావించిన తెరాస ప్రభుత్వానికి ఈ విధంగా వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. పూల నావలా సాగిపోవలసిన తెరాస సర్కార్ ప్రయాణం ముళ్ళబాటపై నడుస్తున్నట్లు తయారైంది. ఒకపక్క స్వీయ తప్పిదాల కారణంగా రాష్ట్రంలో ప్రతిపక్షాలని ఎదుర్కోవలసిరావడం, రెండున్నరేళ్ళు పూర్తి కావస్తున్న పొరుగు రాష్ట్రంతో పంచాయితీలు తేలకపోవడంతో ఊహించని ఇటువంటి ప్రకృతి విపత్తులు కారణంగా చాలా ఇబ్బందులు పడుతోంది. వీటి కారణంగా అది ఎంతో కష్టపడి కూడబెట్టుకొన్న గొప్ప పేరు అంతా మూసీ నదిలో కొట్టుకుపోతోంది.

కనుక తెరాస తన లోపాలని గుర్తించే యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకొని  ఎప్పటికప్పుడు వాటిని సవరించుకొంటూ వీలైనంత వేగంగా మళ్ళీ తన పూర్వ వైభవాన్ని సాధించే ప్రయత్నాలు చేయడం చాలా అవసరం. ఇదే పరిస్థితి ఇంకా కొనసాగినట్లయితే తెలంగాణాలో దాని ప్రత్యేకత కోల్పోక తప్పదు.అప్పుడు అది కూడా రాష్ట్రంలో అన్ని పార్టీలలో ఒకటిగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.