తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు శుభవార్త అందించింది. ఈ నెల 31 వరకు ఆసరా (వృద్ధాప్య) పెన్షన్‌లకు దరఖాస్తులు సమర్పించవచ్చని ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఆసరా పెన్షన్ పొందేందుకు వయోపరిమితిని 57 ఏళ్లకు తగ్గించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 57 ఏళ్ళు నిందినవారు కూడా ఆసరా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
దీనికి అర్హులైన వారిని వెంటనే గుర్తించి, లబ్ధిదారులను ఎంపిక చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ, పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ఫ్) ఆదేశాలు జారీ చేసింది. 57 ఏళ్లు నిండినవారు ఆసరా పెన్షన్ కోసం మీ-సేవ, ఈ-సేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుతో పాటు పుట్టినతేదీ దృవీకరణ పత్రం, ఫోటో, ఆధార్ కార్డు/ ఓటర్ కార్డు వగైరాలను జతపరచవలసి ఉంటుంది. దీని కోసం మీ-సేవ, ఈ -సేవ కేంద్రాల నిర్వాహకులు దరఖాస్తుదారుల నుంచి ఎలాంటి అదనపు రుసుములు వసూలు చేయరాదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది.