8.jpg)
దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో పలు రాష్ట్రాలలో విద్యాసంస్థలు తెరుచుకొంటున్నాయి. తెలంగాణలో రెండు మూడు జిల్లాలలో తప్ప మిగిలిన జిల్లాలలో కరోనా తీవ్రత తగ్గింది...యాక్టివ్, పాజిటివ్ కేసుల సంఖ్య కూడా తగ్గింది. కనుక రాష్ట్రంలో విద్యాసంస్థలను తెరిచేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఇటీవల విద్యాశాఖ అధికారులకు కొన్ని సలహాలు, సూచనలు చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉపాధ్యాయులు, సిబ్బంది, తల్లితండ్రులలో చాలామంది కరోనా సోకకుండా టీకాలు వేసుకొన్నందున, కరోనా జాగ్రత్తలు పాటిస్తూ విద్యాసంస్థలు పునః ప్రారంభించవచ్చని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే దశలవారీగా పునః ప్రారంభించాలా లేదా జాగ్రత్తలు పాటిస్తూ ఒకేసారి అన్ని తరగతులు ప్రారంభించాలా అనేది విద్యాశాఖే నిర్ణయించుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.
ఇంచుమించు ఏడాదిన్నరగా విద్యాసంస్థలు మూతపడటంతో విద్యార్దులు, వారి తల్లితండ్రులపై కూడా మానసికంగా ఒత్తిడి పెరిగిందని, ఆన్లైన్ బోధన వలన విద్యార్దుల మనోవికాసం దెబ్బ తింటుందని కనుక విద్యాసంస్థలు తెరిచి ప్రత్యక్ష పద్దతిలో తరగతులు నిర్వహించడం మంచిదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు విద్యాశాఖ అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. కనుక త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా విద్యాసంస్థలు పునః ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.