
హుజూరాబాద్ ఉపఎన్నిక సిఎం కేసీఆర్, ఈటల రాజేందర్‌కు ప్రతిష్టాత్మకంగా మారాయని అందరికీ తెలుసు. కనుక ఇద్దరూ ఈ ఉపఎన్నిక వేదికగా రాజకీయంగా తమ సత్తా చాటుకోవాలని తహతహలాడుతున్నారు. అయితే టిఆర్ఎస్ అధికారంలో ఉండటం ఆ పార్టీ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు అన్నివిదాల కలిసివచ్చే అంశమని చెప్పవచ్చు. ఈటల వెనుక కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఉన్నప్పటికీ ఈ ఉపఎన్నికలో అది పెద్దగా చేయగలిగిందేమీలేదనే చెప్పవచ్చు. కనుక టిఆర్ఎస్ సైన్యంతో ఈటల ఒంటరి పోరాటం చేస్తున్నట్లే భావించవచ్చు.
ఈ పోరాటంలో భాగంగా ఈటల రాజేందర్ ప్రజలు తనను ఎందుకు గెలిపించాలో... గెలిపిస్తే వారి కోసం, నియోజకవర్గం అభివృద్ధి కోసం ఏమి చేయగలరో చెప్పలేకపోతున్నారు. సిఎం కేసీఆర్ నిరంకుశపాలనను వ్యతిరేకించడానికి, ప్రజల తరపున పోరాడేందుకు తనను గెలిపించాలని వాదిస్తున్నారు. కానీ ప్రజలకు ఈ రాజకీయ ప్రతీకారాలు...పోరాటాలతో ఒరిగేదేమీ ఉండదు. వారికి కావాల్సింది తమ నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమ పధకాలు మాత్రమే. వాటికి టిఆర్ఎస్ పూర్తి భరోసా ఇస్తోంది.
ఉపఎన్నికకు ముందుగానే నియోజకవర్గంలో దళిత బంధు పధకాన్ని అమలుచేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే నియోజకవర్గంలో చిరకాలంగా పెండింగులో ఉన్న పలు అభివృద్ధి పనులు హడావుడిగా పూర్తి చేస్తోంది. తమ అభ్యర్ధిని గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామని, దానికి పూర్తి బాధ్యత వహిస్తామని మంత్రులు హరీష్‌రావు, గంగుల కమలాకర్ హామీ ఇస్తున్నారు. ఈటలను గెలిపిస్తే ఆయన నియోజకవర్గానికి ఏమీ చేయలేరని కనుక అభివృద్ధి కుంటుపడుతుందని గట్టిగా వాదిస్తున్నారు. వారి వాదనలు సహేతుకంగానే ఉన్నందున హుజూరాబాద్ ప్రజలు టిఆర్ఎస్వైపే మొగ్గుచూపవచ్చు. కనుక ఈటల రాజేందర్ ప్రజల నమ్మకాన్ని, వారి ఓట్లను పొందేందుకు ఏమి చేయాలో ఆలోచించుకోవడం మంచిది.