మన దేశంలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా అక్కడ ఏదో ఒక చారిత్రిక లేదా పౌరాణిక ప్రాధాన్యం ఉన్న కట్టడమో, వస్తువులో కనబడుతూనే ఉంటాయి. కానీ వాటి ప్రాధాన్యతని మనమూ గుర్తించము. ప్రభుత్వాలకి కూడా అంత శ్రద్ధ, ఓపిక, తీరిక లేవు కనుకనే ఎంతో గొప్ప చరిత్ర ఉన్న వెయ్యి స్తంభాల గుడిని అంత దీనావస్థలో ఉంది. ఆ ఆలయం పరిసరాలలో పేర్చి ఉంచిన దాని స్తంభాలు, శిల్పాలు ఎండకి ఏండుతూ వానకి తడుస్తూ మట్టికొట్టుకుపోతున్నాయి. అవి రాతి శిలలు గాబట్టి అవి కరుగడం లేదు. మన పాలకుల మనసులు కూడా వాటిలాగే ఏ మాత్రం కరుగడం లేదు.
అటువంటి గొప్ప కట్టడాన్నే పట్టించుకొని మన పాలకులు పక్కనే రఘునాధపల్లెకి సమీపంలో గబ్బెట్ట గ్రామం శివార్లలో ఉన్న మరో చిన్న అద్బుతమైన మూడు కాళ్ళ మండపాన్ని మాత్రం ఎందుకు పట్టించుకొంటారు? రాతియుగం నాటి ఆ గబ్బెట్ట మండపం అటు పాలకుల దృష్టికి నోచుకోలేదు. కనుక పర్యాటకుల దృష్టిలో కూడా పడనేలేదు. దాని గురించి ఆనోటా ఈనోట విన్నవారు మాత్రమే అప్పుడప్పుడు అక్కడికి వచ్చి దానిని చూసి ఆశ్చర్యపోతుంటారు.
ఇంతకీ అదేదో పెద్ద కట్టడం కాదు. సుమారు 2-3,000 కేజీలపైగా బరువుండే ఒక విశాలమైన నున్నటి రాతి పలకని కేవలం కొన్ని బండరాళ్ళు ఆధారం నిలబెట్టబడింది. అది కూడా కేవలం మూడు వైపులే ఉన్నాయి. పైనున్న ఫోటోలో దానిని స్పష్టంగా చూడవచ్చు. క్రిందన పేర్చిన ఆ రాళ్ళని అతకడానికి ఎటువంటి పదార్ధం వాడలేదు. అంత బరువున్న విశాలమైన పలకని సుమారు నాలుగు అడుగుల ఎత్తులో కేవలం కొన్ని బండరాళ్ళు ఆధారంగా నిలబెట్టారు. ఏవో చుట్టుపక్కల దొరికిన రాళ్ళని ఒక దానిపై మరొకటి పేర్చి దానిపై ఆ పలకని అమర్చారు. దానిపై మనుషులు ఎక్కినా అది ఏమాత్రం కదలదు. దాని క్రింద కనీసం 20మంది మనుషులు కూర్చోవచ్చు.
అది సుమారు 1,000 సం.ల క్రితం నాటిదని, గుట్టపై వెలిసిన నరసింహస్వామి అటుగా వెళుతున్నప్పుడు దానిపై విశ్రాంతి తీసుకొనేవాడని స్థానికులు చెపుతుంటారు. కానీ అది రాతియుగం నాటిదని, అక్కడ రాతితో చేసిన పనిముట్లు, పాత్రలు కనుగొన్నామని పురాతత్వ శాస్త్రవేత్త ఆర్. రత్నాకర్ రెడ్డి చెప్పారు. మరో విశేషం ఏమిటంటే ఆ రాతి పలక క్రింద వైపు రెండు వరుసలలో నగిషీలు వంటివి చెక్కబడి ఉన్నాయని చెప్పారు.
అంత బరువున్న రాతి పలకని ఎటువంటి యంత్ర పరికరాలు లేకుండా ఆ ప్రాంతానికి చేర్చడం, దానిని అంత ఎత్తుకు లేపడం ఒక వింత అయితే, అంత బరువైన పలకని కేవలం కొన్ని బండ రాళ్ళ ఆధారంగా స్థిరంగా నిలబెట్టగలగడం మరో విచిత్రమే. అసలు ఎక్కడ ఎన్ని రాళ్ళు పెడితే అది అంత ఒకే లెవెల్ గా, స్థిరంగా నిలబడుతుందనే లెక్క ఆనాడే వారికి తెలియడం సాధారణమైన విషయమేమీ కాదు కదా? అసలు అంత బరువైన పెద్ద పలక క్రింద రాళ్ళు పేర్చేవరకు ఏవిధంగా పైకి లేపి ఉంచారనేది కూడా చాలా ఆలోచింపజేస్తుంది. ఎందుకంటే దాని క్రింద ఆ రాళ్ళు పేర్చేవరకు పైకి లేపి పట్టుకోవడానికి ఆనాడు క్రేన్లు లేవు కదా? మరి ఇంత ఆసక్తికలిగిస్తున్న ఈ మూడు కాళ్ళ మండపాన్ని మన పాలకులు ఎందుకు పట్టించుకోరు? దానిని పర్యాటక ఆకర్ష కేంద్రంగా ఎందుకు గుర్తించరు? అంటే మళ్ళీ వెయ్యి స్తంభాల కధ చెప్పుకోవలసి వస్తుంది.
ఇదే ఏ అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశాలలో అయితే ఒక చిన్న రాయి కనబడితే దాని చుట్టూ ఒక అందమైన పార్క్ నిర్మించేసి దానిని ప్రత్యేక ఆకర్షణ కేంద్రంగా మలిచి ఉండేవారు. కానీ వెయ్యి స్తంభాల గుడినే పట్టించుకొని మనకి ఈ గబ్బెట్ట మండపాన్ని ఎందుకు పట్టించుకొంటాము? ఎవరు పట్టించుకొన్నా పట్టించుకోక పోయినా అది అక్కడే అనేక వేల సంవత్సరాల నుంచి స్థిరంగా ఉంది. కనుక ఈసారి అటువైపు వెళితే దానితో ఓ సేల్ఫీ తీసుకొని రావడం మరిచిపోకండి.