
మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై వేటు వేసిన మర్నాటి నుంచే టిఆర్ఎస్ హుజూరాబాద్‌లో పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరూ చేజారిపోకుండా జాగ్రత్త పడింది. ఈటల రాజేందర్ రాజీనామా చేయగానే ఉపఎన్నిక ప్రచారం కూడా మొదలుపెట్టేసింది. ఇక అభ్యర్ధిని ప్రకటించడమే మిగిలి ఉంది. సిఎం కేసీఆర్ టిఆర్ఎస్ అభ్యర్ధిగా పార్టీ విద్యార్ధి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సిఎం కేసీఆర్ నేడు అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు సమాచారం. టిఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరొందిన మంత్రి హరీష్‌రావుకు హుజూరాబాద్ ఉపఎన్నిక ఇన్-ఛార్జిగా బాధ్యత అప్పగించడంతో ఇప్పటికే ఆయన సిద్ధిపేటలో పార్టీ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్‌తో వరుస సమావేశాలు నిర్వహిస్తూ వారికి మార్గదర్శనం చేస్తున్నారు.
నేడు తొలిసారిగా మంత్రి హరీష్‌రావు హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. టిఆర్ఎస్ అభ్యర్ధి పేరు ఖరారవగానే మంత్రి హరీష్‌రావు హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటన ప్రారంభిస్తుండటం యాదృచ్ఛికం అనుకోలేము. ఆయన మూడు రోజులు హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించి ఎన్నికల ప్రచారం చేస్తారని సమాచారం.