పార్టీ మారడం లేదు...అవన్నీ పుకార్లే: రాజయ్య

టిఆర్ఎస్‌ స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పార్టీ మారబోతున్నారంటూ మీడియాలో వస్తున్న ఊహాగానాలను పుకార్లుగా కొట్టిపడేశారు. ఆయన వైఎస్సార్‌ తెలంగాణ పార్టీలో చేరేందుకు ఇటీవల వైఎస్ షర్మిల భర్త అనీల్‌తో భేటీ అయ్యారని ఊహాగానాలు వినిపించాయి. 

వాటిపై రాజయ్య స్పందిస్తూ, “నేను 2019లో ఓ క్రైస్తవ సమావేశంలో బ్రదర్ అనిల్‌ను కలిసినప్పటి ఫోటో అది. దానిని సోషల్ మీడియాలో పెట్టి నేను పార్టీ మారబోతున్నానంటూ పుకార్లు పుట్టించడం సరికాదు. నేను వాటిని ఖండిస్తున్నాను. నా చివరి శ్వాస వరకు నేను టిఆర్ఎస్‌ పార్టీలో కొనసాగుతాను. పార్టీలో నాకెటువంటి ఇబ్బంది లేదు. సిఎం కేసీఆర్‌ ఆశీర్వాదంతోనే నేను ఈ స్థాయికి ఎదిగాను. ఆయన నాకు ఉప ముఖ్యమంత్రి, మంత్రి పదవులు కూడా ఇచ్చి గౌరవించారు.

దళితుల అభ్యున్నతి కోసం సిఎం కేసీఆర్‌ దళిత బంధు పధకం ప్రవేశపెట్టారు. గతంలో దళితుల కోసం ప్రవేశపెట్టిన అనేక పధకాలు విఫలమవడం చేతనే ఈసారి ఈ దళిత బంధు పధకంతో పాటు దళితులకు రక్షణ కల్పిస్తూ దళిత రక్షణ నిధిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం సిఎం కేసీఆర్‌ అనేక సంక్షేమ పధకాలు రచించి అమలుచేస్తున్నారు. కనుక రాష్ట్రంలో బహుజన్ సమాజ్‌వాదీ (బీఎస్పీ) కొత్తగా చేసేందుకు ఏమీ లేదు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు ఎప్పటికీ టిఆర్ఎస్‌తోనే ఉంటాయి,” అని అన్నారు.