ఏనుగుపై ప్రగతి భవన్‌కు వెళ్దాం: ప్రవీణ్ కుమార్‌

మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ ఎస్ ప్రవీణ్ కుమార్‌ నిన్న నల్గొండలో జరిగిన ‘రాజ్యాధికార సంకల్పసభ’లో బహుజన్ సమాజ్‌వాదీ (బీఎస్పీ)పార్టీలో చేరారు. ఆ పార్టీ ఎంపీ, జాతీయ సమన్వయకర్త రాంజీ గౌతమ్ ఆయనను పార్టీలో చేర్చుకొని తెలంగాణ బీఎస్పీ సమన్వయకర్తగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. నిన్న సాయంత్రం బీఎస్పీ అధ్వర్యంలో స్థానిక ఎన్జీ కళాశాల మైదానంలో జరిగిన ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుండి వేలాదిమంది బడుగుబలహీనవర్గాల ప్రజలు తరలివచ్చారు. మైదానం ఇసుకవేస్తే రాలనంతగా నిండిపోయింది.   

   

ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్‌ అధికార టిఆర్ఎస్‌తో సహా అన్ని పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. “నేను ఉద్యోగానికి రాజీనామా చేసినప్పటి నుంచే నాపై కేసులు నమోదవుతున్నాయి. కనీసం ఈ సభ పెట్టుకోవడానికి కూడా వీలులేకుండా ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు సృష్టించింది. అయినా ఇతమంది సభకు హాజరవడం మన ఆకాంక్షలకు, పట్టుదలకు అద్దం పడుతోంది. ఇదే ఉత్సాహం, పట్టుదలతో 2023లో మనం ఏనుగెక్కి ప్రగతి భవన్‌కు పోదాము. 

ఇంతవరకు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలిస్తున్నవారందరూ మనల్ని మాయమాటలతో మభ్యపెడుతూ మనల్ని ఎదగనీయకుండా చేస్తున్నారు. ఇంకా ఎంతకాలం మనం గొర్రెలు, మేకలు కాస్తూ బ్రతకాలి?మనకు విద్యా, వైద్యం, రాజ్యాధికారానికి అర్హులం కామా?ఉన్నకొద్దిపాటి అవకాశాలనే వినియోగించుకొని మన బిడ్డలు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నారు. అది చూసి పాలకులు నివ్వెరపోర్తున్నారు. మన బిడ్డలకు సరైన విద్యావకాశాలు కల్పిస్తే సమాజంలో మిగిలినవారితో పోటీ పడిగలరు. కానీ ప్రభుత్వం దళిత బిడ్డలు చదువుకొనే ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కాలేజీలను, యూనివర్సిటీలను ప్రభుత్వం పట్టించుకోదు. ఉద్యోగాలను భర్తీ చేయదు. కానీ లక్షలు ఖర్చు చేసి చదివే అగ్రవర్ణాల బిడ్డల కోసం అసెంబ్లీలో ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లును తెచ్చి అనురాగ్, మల్లారెడ్డి యూనివర్సిటీలు ఏర్పాటు చేసింది.      

హుజూరాబాద్‌ ఉపఎన్నిక రాగానే సిఎం కేసీఆర్‌ హటాత్తుగా దళిత బంధు పధకం ప్రకటించి వెయ్యి కోట్లు ఖర్చు పెడుతున్నారు. విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్న ఆ సొమ్ము ఎవరిది? మనందరి కష్టార్జితం కాదా?ఆయనకు మనపై నిజంగా అంతా ప్రేమాభిమానాలు ఉంటే ఆయన సొంత ఆస్తులను అమ్మి పంచిపెట్టొచ్చు కదా?

ఎన్నికలు రాగానే 50 వేల ఉద్యోగాలు అంటారు కానీ నెలలు గడుస్తున్నా నోటిఫికేషన్‌ జారీ చేయరు. హైటెక్ సిటీ, టీ-హబ్‌, ఐ‌టి కంపెనీలలో లక్షలాది ఉద్యోగాలు కల్పించమని ప్రభుత్వం చెప్పుకొంటుంది కానీ దానిలో ఎంతమంది దళిత బిడ్డలకు ఉద్యోగాలు లభించాయి?

రాష్ట్ర స్థాయి నుంచి జాతీయస్థాయి వరకు అంతటా ఇదే పరిస్థితులు నెలకొన్నాయి. కనుక రాజ్యాధికారం కోసం మనం కలిసికట్టుగా పోరాటం చేసి ఇక్కడ గోల్కొండ కోటపై, ఢిల్లీలో ఎర్రకోటపై కూడా మన నీలి జెండాలు ఎగురవేద్దాం. తెలంగాణలో 2023 జరిగే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ఇక్కడి నుంచే సమరం ప్రారంభిద్దాం. పవిత్రమైన ఓట్లను అమ్ముకొని గులాబీ కారు చక్రాల క్రిందపడి నలిగిపొవద్దు. ఏనుగు ఎక్కి ప్రగతి భవన్‌కు వెళ్దాం. రాష్ట్రంలో బహుజన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకొందాం,” అంటూ ప్రవీణ్ కుమార్‌ చాలా ఆవేశపూరితంగా ప్రసంగించారు.