కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రంలో 4 రోజులు పర్యటన

బిజెపి అధిష్టానం ఆదేశం మేరకు కేంద్రమంత్రులు ఆశీర్వాదయాత్ర పేరుతో తమ తమ రాష్ట్రాలలో పర్యటించనున్నారు.  కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ఈ నెల 16 నుంచి 20 వరకు నాలుగు రోజులు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. దేశంలో పేదలకు, ముఖ్యంగా బడుగు బలహీనవర్గాలకు కేంద్రప్రభుత్వం అందజేస్తున్న సహాయసహకారాలు, వారికోసం అమలుచేస్తున్న పలు సంక్షేమ పధకాల గురించి ప్రజలకు తెలియజేసేందుకు కేంద్రమంత్రులు ఆశీర్వాద యాత్రలు చేపట్టాలని బిజెపి అధిష్టానం ఆదేశించింది. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా కిషన్‌రెడ్డి రాష్ట్ర పర్యటన చేస్తున్నందున రాష్ట్ర బిజెపి నేతలు భారీ బైక్‌పై ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి పర్యటన వివరాలు: 

ఈ నెల 15వ తేదీన ఢిల్లీ నుంచి నేరుగా తిరుపతి చేరుకొని రాత్రి తిరుమల కొండపై బస చేస్తారు. మర్నాడు ఉదయం స్వామివారిని దర్శించుకొన్నాక అక్కడి నుంచి విమానంలో విజయవాడ చేరుకొని దుర్గమ్మను దర్శించుకొంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సాయంత్రం 6.30 గంటలకు సూర్యాపేటలోని కోదాడ చేరుకొంటారు. అక్కడి నుంచి ఆశీర్వాద యాత్ర ప్రారంభించి ఖమ్మం చేరుకొంటారు. రాత్రి అక్కడే బస చేసి మర్నాడు ఉదయం 10 గంటలకు రోడ్డు మార్గంలో మహబూబాద్‌కు చేరుకొంటారు. 

ఆగస్ట్ 17న నర్సంపేట, ములుగులో ఆశీర్వాద యాత్రలో పాల్గొంటారు. ఆదేరోజు సాయంత్రం రామప్ప ఆలయాన్ని దర్శించుకొంటారు. అక్కడి నుంచి వరంగల్‌ చేరుకొని భద్రకాళి అమ్మవారిని దర్శించుకొంటారు. రాత్రి వరంగల్‌లో బస చేస్తారు. 

ఆగస్ట్ 18వ తేదీ ఉదయం జనగామ, యాదగిరి గుట్ట, భువనగిరి, ఘట్కేసర్ మీదుగా ఆశీర్వాద యాత్ర కొనసాగిస్తూ సాయంత్రం 4.30 గంటలకు ఉప్పల్ చేరుకొంటారు. రాత్రి 8 గంటలకు నాంపల్లిలోని బిజెపి కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమవుతారు.

ఆగస్ట్ 19,20 తేదీలలో సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గాలలో ఆశీర్వాదయాత్ర చేస్తారు.