రేపు నల్గొండలో ప్రవీణ్ కుమార్‌ రాజకీయ సంకల్పసభ

మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్‌ రేపు అంటే ఆదివారం నల్గొండలో లక్ష మందితో రాజకీయ సంకల్పసభ నిర్వహించనున్నారు. ఆ సభకు ముఖ్య అతిధిగా బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) జాతీయ సమన్వయకర్త ఎంపీ రాంజీ గౌతమ్, తెలంగాణలోని ఆ పార్టీ ముఖ్యనేతలు హాజరుకానున్నారు. వారి సమక్షంలో ప్రవీణ్ కుమార్‌ బీఎస్పీలో చేరానున్నారు. బడుగు బలహీనవర్గాలకు ప్రాతినిధ్యం వహించే బీఎస్పీ తెలంగాణలో కూడా ఉన్నప్పటికీ, బలమైన నాయకత్వం లేకపోవడంతో బడుగు బలహీనవర్గాలను ఆకర్షించలేకపోయింది. కనుక ఆయా వర్గాలప్రజలు అధికార టిఆర్ఎస్‌, ప్రతిపక్షపార్టీలతో కొనసాగుతున్నారు. ఒకవేళ ప్రవీణ్ కుమార్‌ రాష్ట్రంలో బిఎస్పీకి బలమైన నాయకత్వం అందించగలిగితే రాష్ట్రంలో అత్యధిక శాతం జనాభాగా ఉన్న బడుగుబలహీనవర్గాల ప్రజలు బిఎస్పీ వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉంటుంది. అదే కనుక జరిగితే, అధికార టిఆర్ఎస్‌ పార్టీతో సహా ప్రతిపక్ష పార్టీలకు ఇబ్బందులు తప్పవు. కనుక ప్రవీణ్ కుమార్‌ రాజకీయ ఎదుగుదలకు చాలా అవరోధాలు ఎదురయ్యే అవకాశం ఉంది.