మిడ్ మానేరుకి కాదు...అవినీతికి గండి పడిందిట!

తెరాస సర్కార్ చాలా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులలో బారీగా అవినీతి జరుగుతోందని తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మొదటి నుంచి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. కానీ అవి నిరాధారమైన ఆరోపణలని తెరాస సర్కార్, ఆ పార్టీ నేతలు తేలికగా కొట్టి పారేస్తున్నారు. ఇటీవల కురుస్తున్న వానలకి కరీంనగర్ జిల్లాలో మిడ్ మానేరు జలాశయానికి బారీ గండిపడటంతో రేవంత్ రెడ్డి ఆరోపణలు వాస్తవం ఉందని స్పష్టం అయ్యింది. తెదేపా నేతలతో కలిసి ఆయన నిన్న గండిపడిన మిడ్ మానేరుని సందర్శించారు. ఆ సందర్భంగా ఆయన మంత్రులు హరీష్ రావు, తుమ్మల నాగేశ్వరరావుపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. 

మిడ్ మానేరు జలాశయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఈ ప్రాజెక్టుకి గండి పడటానికి కారణం నాసిరకమైన పనులే. దీని నిర్మాణపనులు చేయడానికి మొదట వేరే కంపెనీని భాద్యతలు అప్పగించి హటాత్తుగా దానిని తప్పించేసి తుమ్మల నాగేశ్వరరావు బంధువుకి చెందిన కంపెనీకి కాంట్రాక్ట్ కట్టబెట్టారు. మామా అల్లుళ్ళు కమీషన్లకి కక్కుర్తిపడి తుమ్మల బంధువుకి కాంట్రాక్టు కట్టబెట్టడం వలననే నాసిరకమైన పనులు జరిగాయి. ఆ కారణంగానే గండిపడి పంటలన్నీ నీట మునిగాయి. వారు చేసిన తప్పులకి రైతులు ఎందుకు మూల్యం చెల్లించాలి? నేను చేస్తున్న ఆరోపణలకి నా వద్ద బలమైన ఆధారాలున్నాయి. తెరాస మంత్రులు ఎవరితోనైనా నేను దీనిపై బహిరంగ చర్చకి సిద్దం,” అని అన్నారు.

“తెలంగాణా రైతుల సంక్షేమం కోసమే ప్రాజెక్టులు కడుతున్నామని మామాఅల్లుళ్ళు గట్టిగానే వాదిస్తారు. కానీ ఇటువంటివి చూస్తే వారి మాటలని ఎవరూ నమ్మరు. ఇక్కడ జలాశయానికి గండిపడి పంటలు నీట మునిగితే రైతుల సంక్షేమం గురించి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కెసిఆర్ వారిని పలకరించేందుకు కూడా రాలేదు. ముంపు కారణంగా జరిగిన పంట నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసి కేంద్రప్రభుత్వానికి నివేదిక పంపితే మేము కేంద్రప్రభుత్వంతో మాట్లాడి నిధులు విడుదల కోసం ప్రయత్నిస్తాము. దీని గురించి శాసనసభ సమావేశాలలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తాము,” అని రేవంత్ రెడ్డి అన్నారు.

ఇటీవల కురిసిన బారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి బారీగా వరదనీరు వచ్చి చేరడం చేతనే మిడ్ మానేరుకి గండి పడిందని కళ్ళకి కనబడుతూనే ఉంది. దానికి అధికార, ప్రతిపక్షాల సర్టిఫికెట్లు అవసరం లేదు. కానీ ఆ స్థాయిలో నీటిని నిలువచేసేందుకే ప్రాజెక్టు కట్టుకొన్నప్పుడు వాటికి గండి పడ్డాయంటే కేవలం నాసిరకం పనులే అందుకు కారణం అని అర్ధం అవుతోంది. కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చు చేసి ప్రాజెక్టులు నిర్మిస్తే అవి నీటిని నిలువచేయకపోగా, వాటికి గండ్లు పడటం వలన రైతుల పంటలు నీట మునగడం చాలా శోచనీయం. 

రైతులకి, ప్రభుత్వానికి జరిగిన ఈ నష్టాన్ని పూడ్చవలసిన భాద్యత ఆ ప్రాజెక్టులో నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టరుదే తప్ప కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలది కాదు. కనుక ఆ కాంట్రాక్టర్ చేతే రైతులకి నష్టపరిహారం ఇప్పించి, ఆ ప్రాజెక్టులో నాసిరకం పనులని సరిచేయించి దానికి పడిన గండిని పూడ్పించినట్లయితే ఇక ముందు ఏ కాంట్రాక్టరు ఇటువంటి తప్పులు చేయడానికి సాహసించడు. ఇకపై హైదరాబాద్ లో రోడ్ల నిర్మాణానికి సదరు కాంట్రాక్టరులనే బాధ్యత వహించేలా చేయాలని ఆలోచిస్తున్న తెరాస సర్కార్, ప్రాజెక్టుల నిర్మాణ విషయంలో కూడా అదేవిధానం అవలంభిస్తే పనులలో నాణ్యత కనబడుతుంది. ప్రజాధనం సద్వినియోగం చేసినట్లు అవుతుంది.