ఈ నీళ్ళ పంచాయితీలకి మూల కారణం అదేనా?

ఇటీవల కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి సమక్షంలో ఏపి, తెలంగాణా ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కెసిఆర్ తదితరులతో అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. రెండు రాష్ట్రాల మధ్య జరుగుతున్న జలవివాదాలపై ఆ సమావేశంలో చర్చించారు. ఆ సమావేశంతో అన్ని సమస్యలు మంత్రదండంతో తిప్పినట్లు మాయం అయిపోతాయని ఎవరూ భ్రమ పడలేదు కానీ ఇకనైనా రెండు తెలుగు రాష్ట్రాలు జల వివాదాలని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి చొరవ చూపుతాయని ప్రజలు ఆశించారు. అదేమీ అత్యాశ కాదు కూడా. కానీ అపెక్స్ సమావేశం నిర్వహించి 2 వారాలైనా కాకముందే మళ్ళీ రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలు మొదలయ్యాయి. 

అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో రెండు రాష్ట్రాలలో నీటి లభ్యత, వాడుకని తెలుసుకొని నియంత్రించేందుకు టెలీమెట్రీ పరికరాలని ఏర్పాటు చేద్దామని నిర్ణయించారు. అవి ఏర్పాటు చేసేలోగా ఈ సమస్యల పరిష్కారం కోసం కేంద్రం, రెండు రాష్ట్రాల ప్రతినిధులతో కూడిన ఒక కమిటినీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 

కానీ ఆ కమిటీ ఏర్పాటు చేసేలోగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకి నీటిని తరలించుకొనిపోతోందని, ఆ కారణంగా నాగార్జునసాగర్ లో నీటి మట్టం పెరగడం లేదని పిర్యాదు చేస్తూ మంత్రి హరీష్ రావు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతికి ఒక లేఖ వ్రాశారు. ఏపి ప్రభుత్వం వాడుకొంటున్న నీళ్ళకి అది చూపుతున్న లెక్కలకి ఎక్కడా పొంతన లేదని తన పిర్యాదులో పేర్కొన్నారు. అది ఇష్టం వచ్చినట్లు నీటిని తరలించుకొని పోతున్నా కృష్ణా రివర్ బోర్డ్ చోద్యం చూస్తోందని హరీష్ రావు ఆరోపించారు. ఈ నీటి చౌర్యంపై కేంద్ర జలవనరుల శాఖ తక్షణం అరికట్టాలని బోర్డుకి ఆదేశాలు జారీ చేయాలని, అలాగే వీలయినంత త్వరగా అపెక్స్ కౌన్సిల్ ల్లో నిర్ణయించినట్లుగా కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి ఉమా భారతికి హరీష్ రావు లేఖలో కోరారు.        

ఆయన నిన్న కృష్ణా రివర్ బోర్డ్ చైర్మన్ రామ్ శరణ్, కార్యదర్శి సమీర్ చటర్జీలతో హైదరాబాద్ లోని జలసౌధలో సమావేశం అయ్యారు. ఈ జలదోపిడీని అడ్డుకోవలసిన బాధ్యత వారిపై కూడా ఉందని గుర్తు చేసి, తక్షణమే దానిని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందుకు వారు సానుకూలంగా స్పందించి, ఈ విషయాన్ని పరిశీలించేందుకు ఒక బృందాన్ని పంపుతామని హామీ ఇచ్చారు. 

హరీష్ రావు వాదనలని ఏపి ప్రభుత్వం ఖండించడం తధ్యం. అపెక్స్ కౌన్సిల్ సమావేశం తరువాత కూడా పరిస్థితులలో ఎటువంటి మార్పు రాలేదని ఈ వివాదం రుజువు చేస్తోంది. నిజానికి ఈ సమస్యకి మూలం తెదేపా-తెరాసల మధ్య తీవ్ర రాజకీయ విభేదాలే కారణమని చెప్పవచ్చు. ఒకవేళ ఆ రెండు పార్టీల మధ్య రాజకీయ సఖ్యత ఉండి ఉంటే బహుశః ఈ సమస్యలు ఈవిధంగా అందరి దృష్టికి రాకుండానే పరిష్కరింపబడి ఉండేవేమో? ఒకవేళ రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ లేదా తెదేపా లేదా భాజపాలు అధికారంలో ఉన్నా లేదా, ఆంధ్రాలో తెరాసతో మంచి సఖ్యత ఉన్న జగన్ అధికారంలో ఉండి ఉంటే పరిస్థితులు వేరేగా ఉండేవేమో?