దళిత బంధుపై తొలి కేసు దాఖలు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దళిత బంధు పధకంపై ఊహించినట్లే  హైకోర్టులో కేసులు దాఖలవడం మొదలయ్యాయి. దానిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో నిన్న రెండు వేర్వేరు ప్రజాహితవాజ్యాలు (పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్) దాఖలయ్యాయి. 

తెలంగాణ రిపబ్లిక్ పార్టీ, జనవాహిని పార్టీ, జైస్వరాజ్ పార్టీలకు చెందిన కార్యదర్శులు వేర్వేరుగా రెండు పిటిషన్లు వేశారు. వాటిలో సిఎం కేసీఆర్‌, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల కమీషనర్, రాష్ట్ర ఎన్నికల కమీషనర్, కాంగ్రెస్‌, బిజెపి, టిఆర్ఎస్‌ పార్టీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. 

 తెలంగాణ ప్రభుత్వం ఈ పధకంతో హుజూరాబాద్‌ ఓటర్లను ప్రలోభపెట్టి ఉపఎన్నికలో టిఆర్ఎస్‌ పార్టీకి లబ్ది చేకూర్చాలని ప్రయత్నిస్తోందని వారు లేఖలో ఆరోపించారు. రాష్ట్రంలో 16 ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాలుండగా వాటిలో ఈ పధకాన్ని అమలుచేయకుండా జనరల్ కేటగిరీ కిందకు వచ్చే హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దానిని అమలుచేయాలనుకోవడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ పధకం పేరుతో దళిత ఓటర్ల బ్యాంక్ ఖాతాలలోకి రూ.10 లక్షల జమా చేస్తామని చెపుర్థూ వారిని ప్రలోభపెడుతోందని కనుక ప్రజాప్రతినిధ్య చట్టం ప్రకారం ప్రతివాదులపై చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ పధకాన్ని రాష్ట్రంలోని ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాలలో మాత్రమే అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్లు హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ రెండు పిటిషన్లపై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టే అవకాశం ఉంది.