తెలంగాణ ధనిక రాష్ట్రమే: సిఎం కేసీఆర్‌

మాజీ మంత్రి పెద్దిరెడ్డి శుక్రవారం సాయంత్రం ప్రగతి భవన్‌లో సిఎం కేసీఆర్‌ సమక్షంలో టిఆర్ఎస్‌ పార్టీలో చేరారు. సిఎం కేసీఆర్‌ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పెద్దిరెడ్డి తనకు మంచి స్నేహితుడని గతంలో తామిరువురం మంత్రులుగా కలిసి పనిచేశామని అన్నారు. దళిత బంధు పధకంపై ప్రతిపక్షాలు చేస్తున్న వాదనలు, విమర్శలకు సమాధానం చెపుతూ “తెలంగాణ ఖచ్చితంగా ధనిక రాష్ట్రమే. సంపదను ఇంకా పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతాము. సంపద పెరిగితే తెలంగాణ మరింత ధనిక రాష్ట్రం అవుతుంది. జాతీయ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం ఎక్కువగా ఉంది. దేశంలో అత్యధిక సంక్షేమ పధకాలను ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే విజయవంతం అమలుచేస్తున్నాము. నిజానికి దళిత బంధు పధకం ఏడాది కిందటే ప్రారంభించవలసి ఉంది కానీ కరోనా కారణంగా ఆలస్యమైంది. ఈ పధకానికి లక్ష కోట్లైనా ఖర్చు చేయడానికి వెనకాడబోము...ఆరునూరైనా ఈ పధకాన్ని మద్యలో ఆపేది లేదు,” అని సిఎం కేసీఆర్‌ అన్నారు.