
బిజెపిలో ఈటల రాజేందర్‌ను చేర్చుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆ పార్టీకి రాజీనామా చేసిన మాజీమంత్రి ఐనుగాల పెద్దిరెడ్డి నేడు టిఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రగతి భవన్‌లో సిఎం కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన హుజూరాబాద్ నుంచి తన అనుచరులతో కలిసి బారీ కార్, బైక్ ర్యాలీతో బయలుదేరి హైదరాబాద్ చేరుకొంటారు.
హుజూరాబాద్‌లో నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, “నియోజకవర్గం అభివృద్ధి కోసమే నేను టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాను తప్ప పదవులు, టికెట్ ఆశించి కాదు. సిఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పధకాన్ని నేను స్వాగతిస్తున్నాను. దానిపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు సరికాదు. ప్రతిపక్షాలు ఈ పధకంపై దుష్ప్రచారం చేస్తూ హుజూరాబాద్ ఓటర్ల భావోద్వేగాలు రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నాయి. కనుక ఓటర్లు వారి మాయమాటలను నమ్మవద్దని కోరుతున్నాను. హుజూరాబాద్ ఉపఎన్నికలో ఓటర్లు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని పెద్దిరెడ్డి అన్నారు.