
హుజూరాబాద్ ఉపఎన్నికను అధికార టిఆర్ఎస్, బిజెపిలు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయో తెలియజేసే ప్రత్యక్ష ఉదాహరణ ఇది. ఈటల రాజేందర్ బావమరిది మధుసూధన్ ఎస్సీ ఎస్టీలను కించపరిచేవిధంగా మాట్లాడారని సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో తమపై టిఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని ఈటల రాజేందర్ సతీమణి జమున తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె నేతృత్వంలో వారి అనుచరులు, బిజెపి శ్రేణులు హుజూరాబాద్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్దకు ర్యాలీగా బయలుదేరి వెళ్ళి అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన తరువాత అక్కడే సిఎం కేసీఆర్ దిష్టిబొమ్మను తగులబెట్టి నిరసనలు తెలియజేశారు. ఈవిషయం తెలుసుకొన్న టిఆర్ఎస్ కార్యకర్తలు కూడా అక్కడి చేరుకొని ఈటల రాజేందర్, బిజెపిలకు వ్యతిరేకంగా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరువర్గాలు తీవ్ర వాగ్వాదాలతో కొట్టుకొనేందుకు సిద్దపడుతుండటం పోలీసులు లాఠీ ఛార్జీ చేసి వారిని చెదరగొట్టారు.
ఇంకా ఎన్నికల గంట మ్రోగకమునుపే నియోజకవర్గంలో ఇంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉంటే ఎన్నికలు జరిగే సమయంలో పరిస్థితులు ఏవిదంగా ఉంటాయో ఊహించుకోవచ్చు.