వాళ్ళకి కొంచెం టైం ఇస్తే బాగుండేది కదా

గత కొద్దిరోజులుగా కురుస్తున్న బారీ వర్షాల కారణంగా హైదరాబాద్ అస్తవ్యస్తం అవుతుండటంతో, ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు జి.హెచ్.ఎం.సి. అధికారులు నగరంలో, శివార్లలో నల్లాలు, చెరువులపై అక్రమంగా నిర్మించిన ఇళ్ళని తొలగించే కార్యక్రమాలు యుద్దప్రాతిపదికన ప్రారంభించారు. కానీ ముందుగా రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధులు, బడాబాబుల కబ్జాల జోలికిపోకుండా, సామాన్యులు, మధ్యతరగతి ప్రజల మీద జి.హెచ్.ఎం.సి. అధికారులు తమ ప్రతాపం చూపిస్తుండటంతో వారు లబోదిబోమని మొత్తుకొంటున్నారు. 

అల్వాల్‌, సుబాష్ నగర్, ఆరాం ఘర్‌, కూకట్ పల్లి, బాలాజీ నగర్‌, భగత్ సింగ్ నగర్, రామచంద్రాపురం, గచ్చిబౌలి, కుత్బుల్లాపూర్, జయశంకర్‌నగర్‌, మారుతీనగర్‌, గాజుల రామారం,  బేగంపేట తదితర ప్రాంతాలలో నాలాలపై నిర్మించిన ఇళ్ళు, ప్రహారీ గోడలని అధికారులు కూల్చి వేస్తున్నారు. మొదటిరోజునే ఈ ప్రాంతాలలో జి.హెచ్.ఎం.సి. సిబ్బంది సుమారు 30 భవనాల వరకు కూల్చివేశారు. వాటిలో కొన్ని పెద్ద పెద్ద అపార్టుమెంటులు కూడా ఉన్నాయి. 

నగరంలో ఈ ఆక్రమణ తొలగింపులకి రకరకాల సమస్యలు ఎదురవుతున్నాయి. అల్వాల్ ప్రాంతంలో ఒకచోట జి.హెచ్.ఎం.సి. సిబ్బంది ఒక నాలాకి దగ్గరలో నిర్మించబడిన కాంపౌండ్ వాల్ ని కూల్చి వేయడం మొదలుపెట్టగానే, దాని నిర్మాణం కోసం జి.హెచ్.ఎం.సి. టౌన్ ప్లానింగ్ అధికారులు ఇచ్చిన అనుమతి పత్రాలు సదరు యజమాని చూపించడంతో అధికారులు వెనుతిరగవలసి వచ్చింది.

కూకట్ పల్లిలో కొత్తగా నిర్మితమవుతున్న అపార్ట్ మెంటుని కూల్చివేస్తున్నప్పుడు, దానిలో ఫ్లాట్స్ కొనుకొన్న యజమానులు జి.హెచ్.ఎం.సి. అధికారులతో తీవ్రవాగ్వాదం చేశారు. అపార్ట్ మెంటు కట్టడానికి బిల్డర్ దగ్గర లంచాలు తీసుకొని దానికి అనుమతులు ఇచ్చి, ఇప్పుడు అది అక్రమకట్టడం అని కూల్చివేస్తే తాము ఎక్కడికి పోవాలి? బిల్డర్ కి చెల్లించిన డబ్బును ఎవరు తిరిగి ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. 

ఈ ఆక్రమణలు తొలగింపు కార్యక్రమంలో జి.హెచ్.ఎం.సి. అధికారులు మున్ముందు ఇటువంటి ప్రశ్నలు, సవాళ్ళు, వేడికోళ్ళు చాలానే ఎదుర్కోవలసిరావచ్చు. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు, ప్రజా ప్రతినిధులు, బడాబాబుల ఇళ్ళ జోలికి వెళ్ళే సాహసం చేస్తే రాజకీయ ఒత్తిళ్ళు ఎదుర్కోవలసి ఉంటుంది. న్యాయపోరాటాలకి సిద్దం కావలసి ఉంటుంది. 

లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఇన్ని రోజులు ఊరుకొని ఇప్పుడు హటాత్తుగా   జి.హెచ్.ఎం.సి. అధికారులని, సిబ్బందిని ప్రజలపైకి ఈవిధంగా దండయాత్రలకి పంపడం కంటే అందరికీ నోటీసులు పంపి, ప్రత్యామ్నాయ వసతి ఏర్పాటు చేసుకొనేందుకు ప్రజలకి తగినంత సమయం ఇచ్చి ఉంటే బాగుండేది. ముఖ్యంగా నగరంలో బారీ వర్షాలు కురుస్తున్న ఈ సమయంలో ఇళ్ళు కూలగొట్టి ప్రజలని రోడ్లమీద పడేయడం వలన ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరుగుతుందని గ్రహించాలి. ఆక్రమణదారులలో కొందరు తెలిసి, చాలా మంది తెలియకనే ఇళ్ళని ఏర్పాటు చేసుకొని ఉంటారు కనుక మానవతా దృక్పదంతో అందరికీ తగినంత సమయం ఇచ్చి ఆక్రమణలు తొలగిస్తే బాగుంటుంది.