
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు ఉదయం మునుగోడు నియోజకవర్గంలో జరుగుతున్న ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి జగదీష్ రెడ్డి వస్తుండగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ఆయన కాన్వాయ్‌ని అడ్డుకొన్నారు. పోలీసులు వారిని చెదరగొట్టి రాజగోపాల్ రెడ్డిని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
తరువాత రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “మంత్రి జగదీష్ రెడ్డి జిల్లాలో ఎటువంటి అభివృద్ధి పనులు చేయకుండా రేషన్ కార్డుల పంపిణీకి రావడం సిగ్గుచేటు. దళిత బంధు పధకంపై ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయాలి లేకుంటే టిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ ఇలాగే అడ్డుకొంటాము. మంత్రి పర్యటనకు వస్తే ముందుగానే కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అధికారం ఉంది కదా అని మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ, అరెస్టులు చేస్తుంటే మేము చూస్తూ ఊరుకోము,” అని తీవ్రంగా హెచ్చరించారు.