బసవరాజ బొమ్మై కర్ణాటక రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. నాటకీయ పరిణామాల మద్య బిఎస్ యడియూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తరువాత నిన్న బెంగళూరులో బిజెపి శాసనసభాపక్ష సమావేశం జరిగింది. దానిలో యడియూరప్ప తనకు అత్యంత ఆప్తుడు, తన క్యాబినెట్లో హోంమంత్రిగా పనిచేసిన బసవరాజ బొమ్మై పేరును ప్రతిపాదించగా దానికి శాసనసభ్యులందరూ ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి అధిష్టానం తరపున పరిశీలకులుగా కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ నేత డికె.అరుణ హాజరయ్యారు.
కర్ణాటక బిజెపి శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన తరువాత బొమ్మై రాజ్‌భవన్‌కు వెళ్ళి గవర్నర్ థాపర్ చంద్ర గెహ్లాట్‌ను కలిసి ఈ విషయం తెలియజేసి ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానించవలసిందిగా కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఇవాళ్ళ రాజ్‌భవన్‌లో బసవరాజ బొమ్మై కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయన తండ్రి ఎస్.ఆర్.బొమ్మై కూడా గతంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా చేశారు.
యడియూరప్ప తన పేరును ముఖ్యమంత్రి పదవికి ప్రతిపాదించగానే బొమ్మై ఆయన పాదాలకు నమస్కరించి కృతజ్ఞతలు తెలుపుకొని తన విధేయతను కూడా చాటుకొన్నారు. కనుక యడియూరప్ప చేతిలోనే ముఖ్యమంత్రి ఉన్నట్లు భావించవచ్చు. కనుక ఆయన సూచించినవారే మంత్రులుగా ఉంటారు. అంటే పేరుకి బొమ్మై ముఖ్యమంత్రి అయినప్పటికీ యడియూరప్పే పరోక్షంగా ప్రభుత్వాన్ని నడిపించబోతున్నారని స్పష్టం అవుతోంది.