హుజూరాబాద్‌లో మిగిలినవాళ్ళు ఓటర్లు కారా? విజయశాంతి ప్రశ్న

హుజూరాబాద్‌ ఉపఎన్నికను దృష్టిలో ఉంచుకొనే సిఎం కేసీఆర్‌ హడావుడిగా దళిత బంధు పధకాన్ని తెరపైకి తెచ్చారని బిజెపి సీనియర్ నేత విజయశాంతి ఆరోపించారు. ఓట్ల కోసమే ఈ పధకం అమలుచేస్తున్నప్పుడు, నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలందరికీ కూడా కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో మొత్తం 70 వేలమంది బడుగులున్నారని కానీ వారిలో కేవలం 20వేల మందికి మాత్రమే ఇవ్వడం ఏమి న్యాయమని ఆమె ప్రశ్నించారు?మిగిలినవాళ్ళు ఓటర్లు కారా...వారి ఓట్లు టిఆర్ఎస్‌ పార్టీకి అవసరం లేదా? అని విజయశాంతి ప్రశ్నించారు. నియోజకవర్గంలో పర్యటిస్తున్న మంత్రులను, ఎమ్మెల్యేలను అన్ని వర్గాల ప్రజలు నిలదీసి తమకూ రూ.10 లక్షలు ఇవ్వాలని కోరాలని ఆమె సూచించారు. ఉపఎన్నికకు ముందే నియోజకవర్గంలో 20వేల దళిత కుటుంబాలకు ఈ పధకం కింద రూ.10 లక్షల చొప్పున ఇచ్చి సిఎం కేసీఆర్‌ చిత్తశుద్ది చాటుకోవాలని విజయశాంతి కోరారు.   

టిఆర్ఎస్‌ అధికారంలోకి వస్తే దళితవ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తానని, దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు ఇస్తానని మభ్యపెట్టి గెలిచిన కేసీఆర్‌ మళ్ళీ ఇప్పుడు ఈ దళిత బంధు పధకంతో మరోసారి దళితులను మభ్యపెట్టి వారి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని విజయశాంతి ఆరోపించారు. ఈ పధకం కింద రాష్ట్రంలో ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున పంచడం సాధ్యమేనా?అని విజయశాంతి ప్రశ్నించారు.