
వర్షాకాలంలో వర్షాలు పడటం ఎంత సహజమో...ఎన్నికలొస్తేనే వరాలవాన కురవడం అంతే సహజం. ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వాటికి అదనంగా హుజూరాబాద్‌లో వరాలవానలు కురుస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు సింగరేణి కార్మికులపై కూడా వరాల చిరుజల్లులు కురుస్తున్నాయి. అంటే త్వరలో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగబోతున్నాయన్న మాట.
సింగరేణి కార్మికులు, కార్యాలయ ఉద్యోగులు, అధికారులు అందరికీ పదవీ విరమణ వయసును 60 నుంచి 61 ఏళ్ళకు పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకు ఈరోజు సింగరేణి పాలకమండలి సమావేశంలో ఆమోదముద్ర వేశారు. దీనిని మార్చి 31వ తేదీ నుంచి వర్తింపజేయాలని నిర్ణయించడంతో ఆరోజు నుంచి ఇప్పటివరకు పదవీ విరమణ చేసిన 39 మంది అధికారులు, 689 మంది కార్మికులు మళ్ళీ విధులలో చేర్చుకొనేందుకు సింగరేణి బోర్డు ఆమోదం తెలిపింది.
అలాగే కారుణ్య నియామకాలపై కూడా బోర్డు కీలక నిర్ణయం తీసుకొంది. ఇప్పటివరకు ఈ పధకంలో భాగంగా పదవీ విరమణ చేసిన కార్మికులు, కార్యాలయ ఉద్యోగుల కుమారులకు లేదా అవివాహిత కుమార్తెలకు మాత్రమే ఉద్యోగావకాశం కల్పించేవారు. కానీ ఇక నుంచి సదరు ఉద్యోగిపై ఆధారపడి ఉన్న కుమార్తెలు, వారిలో భర్త నుంచి విడిపోయిన ఒంటరిగా జీవిస్తున్నవారికి కూడా వయోపరిమితికి లోబడి సింగరేణిలో ఉద్యోగావకాశం లభిస్తుంది.
శ్రీరాంపూర్ ఏరియాలో నస్పూర్ కాలనీ వద్ద జాతీయ రహదారి నిర్మాణంలో నిర్వాసితులకు సింగరేణి కాలనీలో 85 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన 201 ప్లాట్లను కేటాయించాలని బోర్డు సమావేశంలో నిర్ణయించారు. సామాజిక బాధ్యత(కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ)లో భాగంగా సింగరేణి పరిసర ప్రాంతాలలో అభివృద్ధి, మౌలికవసతుల కల్పన కోసం రూ.60 కోట్లు ఖర్చు చేసేందుకు సింగరేణి బోర్డు ఆమోదం తెలిపింది.